- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ బంద్‌కు ఆ పార్టీ మద్దతు ఇవ్వడం విడ్డూరం: సీపీఎం కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్ర విమర్శలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకమాడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకమాడుతున్నదని (CPM) సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (John Wesley) విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటూ మరోవైపు 18న జరిగే బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంతో కలిసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో బీసీ సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు భాగస్వాములు కావాలని కోరారు. శుక్రవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఆరు నెలలు దాటిన ఆమోదించలేదని మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, (BC Reservations) బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతున్నదని ప్రశ్నించారు. బీసీ జేఏసీ నేతలు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించాలని కోరారు. బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడంతో ప్రజలకు సరైన దిశ ఉండబోదన్నారు. ఈ నెల 18న బీజేపీకి వ్యతిరేకంగా బంద్ చేపడితే పాల్గొంటామని, లేదంటే అదేరోజు తమ పార్టీ ఆధ్వర్యంలో మండలాలు, పట్టణాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, బైక్ యాత్రలు నిర్వహిస్తామని, కేంద్రం తీరును నిరసిస్తామన్నారు.
అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలని, ఈ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జరగాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గొనేది లేదని తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామన్నారు.






