CPM : ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పు.. ఫిబ్రవరి 15 వరకు సీపీఎం నిరసనలు

by Ramesh Naini |

మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఇజీఏ) కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.

CPM : ఉపాధి హామీ పథకం చట్టం పేరు మార్పు.. ఫిబ్రవరి 15 వరకు సీపీఎం నిరసనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఇజీఏ) కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దాని స్థానంలో ‘వీబీ-జీ రామ్ జీ’ పేరుతో కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేసిందని ఆరోపించారు. కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంజీఎన్ఆర్ఇజీఏ చట్టాన్ని కాపాడుకోవడానికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటనలో తెలిపారు.

పేదల పొట్ట కొట్టడానికి ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా, ‘వీబీ-జీ రామ్ జీ’ అనే కొత్త చట్టాన్ని కేంద్రం తెచ్చిందని, పాత చట్టంలో కేంద్రం 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే, కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపుతున్నారని, దీంతో ఆర్థిక స్తోమత లేని రాష్ట్రాలు ఈ భారాన్ని భరించలేక పథకాన్ని ఆపేసే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పని దినాలను తొలగించాలనే నిబంధన కూలీలను తిరిగి యజమానుల వద్ద తక్కువ వేతనానికి బానిసలుగా మార్చే కుట్ర ఉందన్నారు. ఈ కొత్త చట్టం వల్ల రాజ్యాంగం కల్పించిన ‘పని హక్కు’ను కూలీలు కోల్పోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని, వీరందరిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. కొత్త చట్టం వల్ల నిధులు, పనిదినాలు పూర్తిగా తగ్గిపోతాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ‘వీబీ-జీ రామ్ జీ’ ని వెంటనే రద్దు చేయాలని, ఎంఎన్ఆర్ఈజీఎస్-2005 చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని కోరారు. పని దినాలను 200 రోజులకు పెంచడంతో పాటు, రోజువారీ వేతనం రూ.800లకు పెంచాలని, పట్టణ పేదలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేయాలని, నిధులు మొత్తం కేంద్రమే భరించాలని, చట్టం అమలు బాధ్యత కేంద్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story