MLC Elections: మాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస్ కు మిత్ర పక్షాల ఒత్తిడి

by Prasad Jukanti |

ఎమ్మెల్సీ అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

MLC Elections:  మాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస్ కు మిత్ర పక్షాల ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ దక్కించుకున్నవారు ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలో తమకు ఓ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్ర పక్షాలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా సీపీఐ (CPM) రాష్ట్ర నేతల బృందం ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను (PCC Chief Mahesh Kumar Goud) కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పల్లె నర్సింహ తదితరులు పీసీసీ చీఫ్‌ను కలిశారు. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు.

మిత్రపక్షాల డిమాండ్

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ, టీజేఎస్ కాంగ్రెస్ (Congress) మధ్య పొత్తు కుదిరింది. అప్పటి నుంచి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ, టీజేఎస్ (TJS) పార్టీలు నామినేటెడ్ పోస్టులు, ఆయా ఎన్నికల్లో తమ వాటా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ ఒక సీటు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ, బీజేపీని ఓడించాలంటే తమ అభ్యర్థులే పోటీలో ఉండాలని కామ్రేడ్లను కాంగ్రెస్ ఒప్పించింది. ఆ తర్వాత సీపీఐ నేతలు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసి పదవుల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తాజాగా పీసీసీ చీఫ్‌ను కలిసి ఎమ్మెల్సీ అవకాశంతో పాటు నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంటర్నల్‌గా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కోదండరామ్‌కు (Kodandaram) కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అయితే ఒప్పందంలో భాగంగా మరో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు కోరాలని టీజేఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కొంత కాలంగా చాలా విషయాల్లో ఎంఐఎం, కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్థానం ఎంఐఎంకు కేటాయించే ఆలోచన సైతం గాంధీభవన్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి అకామిడేట్ చేయబోతున్నదని అనేది వేచి చూడాలి మరి.

Next Story