కర్రెగుట్టలో కూంబింగ్ ఆపండి.. కేంద్రంపై CPIM సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-20 13:06:17  IST  )

ఆపరేషన్ కాగర్-2 పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

కర్రెగుట్టలో కూంబింగ్ ఆపండి.. కేంద్రంపై CPIM సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కాగర్-2 పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటన విడుదల చేశారు. ‘అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను తక్షణమే వెనక్కి తీసుకొని, ఈ కూంబింగ్‌ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర హెూంశాఖ విధించిన 40 రోజుల డెడ్‌లైన్ పేరుతో కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు ప్రచారం జరుగుతున్నది.

మరికొంత మంది అగ్రనేతల ప్రాణాలకు హాని కలిగించేలా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరం. మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడంలేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించి ఉన్నారు. హింసాత్మక చర్యలను నిలిపివేసి, సమస్య పరిష్కారానికి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా వారితో చర్చలు జరపాలని దేశ వ్యాపితంగా మా పార్టీతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మొండిగా హింసాత్మక మార్గాన్నే ఎంచుకోవడం సరైంది కాదు. తక్షణమే ఈ మారణకాండను నిలిపివేయాలని, అటవీ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలి’ అని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

Next Story