మద్దతు ప్రకటించిన సీపీఎం, సీపీఐ

by Gantepaka Srikanth |

కేంద్ర కార్మిక సంఘాలు గురువారం చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మద్దతు ప్రకటించిన సీపీఎం, సీపీఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర కార్మిక సంఘాలు గురువారం చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాపితంగా సమ్మెకు మద్దతుగా జరిగే సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలలో సీపీఐ, సీపీఎం శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. పోరాడి సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చినందుకు కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని వారు తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన వ్యవసాయానికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో రైతుల ఆందోళనకు తలొగ్గి కేంద్రప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. తాజా అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో దేశ రైతుల ప్రయోజనాలను అమెరికా వద్ద కేంద్ర ప్రభుత్వం తాకట్టుపెట్టిందని అన్నారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌పరం చేసి కార్పోరేట్స్‌కు దేశ సంపదను దారపోస్తున్నదని తెలిపారు. అధిక పన్నులతో సామాన్యులపై భారం మోపుతున్నదని అన్నారు. ఈ అన్ని అంశాలపై గురువారం జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ మద్దతు తెలిపి జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story