- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధరల భారంపై సీపీఐ పోరు.. జూన్ 10న కలెక్టరేట్ల ముట్టడి: కూనంనేని
బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల 10వ తేదీన నిరసన ధర్నాలు చేపడుతున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అచ్చే దిన్’ వస్తాయని చెప్పి, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పెడుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం, సామాన్యులపై మాత్రం పన్నుల భారం వేస్తున్నదని, ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సాంబశివరావు పేర్కొన్నారు.
2014 మే నెలలో పెట్రోల్ ధర రూ. 72 ఉంటే నేడు రూ.111కు చేరిందని, రూ.55 ఉన్న డీజిల్ రూ.103 కు చేరిందని వారన్నారు. 2014 మార్చిలో గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్ ధర కేవలం రూ. 410.50 గా ఉంటే, గత పదేళ్లలో ప్రభుత్వం సబ్సిడీలను క్రమంగా ఎత్తివేసి, ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు సిలిండర్ ధర రూ. 1,240 చేరిందని, వాణిజ్య సిలిండర్ ధర రూ. 1600 నుంచి బీజేపీ పాలనలో అది రూ. 3,367కు చేరిందని వారన్నారు. రూ.90 ఉన్న వంట నూనె ఇప్ప్పుడు రూ.180కి చేరిందన్నారు, ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు జీవించడం కష్టమవుతుందని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు నష్టపోకుండా రేట్లు పెంచుతున్నారని తెలిపారు. పెంచిన నిత్యావసర, గ్యాస్, పెట్రో ఉత్పత్తుల రేట్లను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయాల ముందు జరుగు ఆందోళన కార్యక్రమాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సాంబశివరావు కోరారు.






