విద్యుత్‌ రంగంపై కేంద్రం కుట్రలో తెలంగాణ భాగం కావొద్దు.. సీపీఎం బీవీ రాఘవులు కీలక సూచనలు

by Ramesh Naini |

దేశంలో విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు.

విద్యుత్‌ రంగంపై కేంద్రం కుట్రలో తెలంగాణ భాగం కావొద్దు.. సీపీఎం బీవీ రాఘవులు కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో (power sector) విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (CPM leader BV Raghavulu) ఆరోపించారు. ప్రైవేటు పరం చేయడంతో ప్రజలు, రైతులు, వినియోగదారులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్‌ సబ్సిడీలు రద్దయ్యే అవకాశముందని చెప్పారు. విద్యుత్‌ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్‌ సవరణ చట్టం-2025 పేరుతో ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను విడుదల చేసిందన్నారు.

30 రోజుల పాటు అభ్యంతరాలను తెలపాలంటూ గడువు విధించిందని, 2021లో విద్యుత్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తే తీవ్ర ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. 2022లో మళ్లీ సవరణలు తెస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయనీ, దాన్ని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అప్పగించిందని వివరించారు. అది చట్ట రూపం దాల్చలేదన్నారు. పాత అంశాలతో పాటు కొత్తవి జోడించి విద్యుత్‌ సవరణ చట్టం ప్రతిపాదనలను దుర్మార్గమని విమర్శించారు. విద్యుత్‌ రంగం అదానీ ఆధీనంలోకి వెళ్తుందని, విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రైవేటు పరమవుతాయని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అమలు చేయడం వల్ల రైతాంగానికి మేలు కలుగుతున్నదని వివరించారు. విద్యుత్‌ సవరణలు అమలైతే ఉచిత విద్యుత్‌ ఉండబోదనీ, బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

కేంద్రం కుట్రలో తెలంగాణ భాగం కావొద్దు

రాష్ట్రంలో ప్రస్తుతం సీపీడీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ రెండు డిస్కంలు ఉన్నాయని, కొత్త విద్యుత్‌ సవరణ చట్టం అమల్లోకి వస్తే ఉచిత విద్యుత్‌ అమలయ్యే అవకాశం లేదన్నారు. ఇవి కాకుండా కొత్త డిస్కం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం కుట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భాగం కావొద్దని కోరారు.

భారత్‌పై ట్రంప్‌ కక్ష

భారత్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్‌లతో తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. చైనా మీద వంద శాతం టారిఫ్‌లను పెంచిందన్నారు. ఇరాన్‌లో చమురు దిగుమతి చేసుకుంటున్నారనే పేరుతో ట్రంప్‌ కొత్త టారిఫ్‌ జాబితాను విడుదల చేశారని అన్నారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచారని వివరించారు. భారత్‌పై ట్రంప్‌ కక్ష పెంచుకున్నారని విమర్శించారు. ట్రంప్‌ పెత్తనాన్ని, దాష్టీకాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ విధించే టారిఫ్‌లో వ్యవసాయరంగంపై ప్రభావం పడుతుందన్నారు. దేశంలో వ్యవసాయరంగాన్ని రక్షించుకోకుంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు.

బీహార్‌లో ఎంఐఎం కక్షసాధింపుతో పోటీ చేయొద్దు

బీహార్‌లో మహాకూటమిలో చేరేందుకు నిరాకరిస్తున్నందుకే వంద సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకున్నట్టు అసదుద్దీన్‌బఒవైసీ ప్రకటించారని రాఘవులు చెప్పారు. రాజకీయ బలం ఉంటే పోటీ చేయొచ్చని అన్నారు. చెప్పినట్టు వినలేదు కాబట్టి నచ్చినట్టు పోటీ చేస్తామంటే సరైంది కాదని వివరించారు. అలా అయితే బీహార్‌ తూర్పు ప్రాంతంలో వామపక్షాలు బలమైన శక్తిగా ఉన్నాయనీ, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశముందని చెప్పారు. కానీ బీజేపీని ఓడించడం కోసం తాము అవసరం మేరకే పోటీ చేస్తున్నామని వివరించారు. లద్దాఖ్‌లో వాంగ్‌చుక్‌ అరెస్టు అప్రస్వామికమని విమర్శించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

న్యాయ పోరాటంతో పాటు కేంద్రంతో పోరాడాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. న్యాయ పోరాటంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని కోరారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా చూడాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలనీ లేదంటే ఆ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. పోటీపై నగర పార్టీతో చర్చిస్తామన్నారు. పోటీ చేయకుంటే బీజేపీని ఓడించే పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Next Story