ఫెయిల్ చేస్తామని విద్యార్థులకు బెదిరింపులు.. CM రేవంత్ జోక్యం చేసుకోవాలని CPIM విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో యాజమాన్యం విద్యార్థుల నుండి నాలుగున్నర సంవత్సరాలకు బదులుగా ఐదు సంవత్సరాలకు అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

ఫెయిల్ చేస్తామని విద్యార్థులకు బెదిరింపులు.. CM రేవంత్ జోక్యం చేసుకోవాలని CPIM విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో యాజమాన్యం విద్యార్థుల నుండి నాలుగున్నర సంవత్సరాలకు బదులుగా ఐదు సంవత్సరాలకు అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలలో 2091 మంది బీ-కేటగిరీకి చెందిన ఒక్కో విద్యార్థి నుండి రూ.11.50లక్షలు, 872 మంది సి-కేటగిరీకి చెందిన ఒక్కో విద్యార్థి నుండి రూ.23 లక్షల నుండి 26 లక్షల వరకు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై 209 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేస్తున్నారని తెలిపారు.

కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ రిజిస్ట్రార్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు అధిక ఫీజులు వసూలు చేయరాదని సర్క్యులర్ జారీ చేసినా, ప్రయివేటు యాజమాన్యాలు యధావిధిగా వసూలు చేయడం, పైగా విద్యార్థులను మార్కులు తక్కువగా వేసి ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా తెలుస్తున్నదని, దీన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీయ యాజమాన్యం రాజకీయ పలుకుబడి కలిగిన వారే యజమానులుగా ఉండటం వల్ల తమ రాజకీయ ప్రాబల్యంతో, అధికార పార్టీ అండదండలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు విద్యార్థులను నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి విద్యార్థులకు ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story