కమ్యూనిస్టుల దెబ్బకు ఎవరైనా తలవంచాల్సిందే: కూనంనేని

by Disha Web Desk 2 |
కమ్యూనిస్టుల దెబ్బకు ఎవరైనా తలవంచాల్సిందే: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు కేవలం కమ్యూనిస్టు‌లు జరుపుకునే సాయుధ పోరాట ఉత్సవాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక చోటికి వచ్చి జరుపుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అన్నారు. కమ్యూనిస్టుల దెబ్బకు ఎవరైనా తలవంచాల్సిందేనని పేర్కొన్నారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభలో మాట్లాడారు. చరిత్రను వక్రీకరించేందుకే అమిత్ షా సిగ్గులేకుండా రాష్ట్రానికి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మోడీకి మిత్రుడు ఓవైసీ: నారాయణ

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ సాయుధ పోరాటంలో ఎలాంటి కృషి లేని వారు ఇప్పుడు వక్ర బాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్నారు. ఎంఐఎం మూలాలు కాశీం రజ్వీ నుంచి వచ్చాయని, దేశంలో నరేంద్ర మోడీకి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉంటే అది ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అని వెల్లడించారు.

సావర్కర్ తెలంగాణకు ఎందుకు రాలేదు?: సురవరం

సీపీఐ మాజీ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తీరు చూస్తుంటే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలాగా ఉందని ఎద్దేవా చేశారు. ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే, ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నది ఆనాడు పోరాటంలో లేని బీజేపీ అని అన్నారు. ఎవరైనా ఉత్సవాలు జరుపుకోవచ్చు కానీ, వక్రీకరణలతో జరపొద్దన్నారు. పోరాటం కమ్యూనిస్టులు లేకుండా జరిగిందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆర్ఎస్‌ఎస్ వీరుడు అప్పుడు తెలంగాణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా కనీసం పత్రికా ప్రకటనైనా ఎందుకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రొఫెసర్ కాశీం, స్వాతంత్య్ర సమరయోధుడు మోయినొద్దీన్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed