'గిరిజన రాష్ట్రపతితో ఆదివాసీల కన్నుపొడిపిస్తున్న మోడీ సర్కార్'

by samatah |   (  Updated:2022-11-28 15:47:04  IST  )

ఒక వైపు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం మరోవైపు అదే గిరిజన మహిళా రాష్ట్రపతి చేతనే

గిరిజన రాష్ట్రపతితో ఆదివాసీల కన్నుపొడిపిస్తున్న మోడీ సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక వైపు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం మరోవైపు అదే గిరిజన మహిళా రాష్ట్రపతి చేతనే గిరిజన, ఆదివాసీల కన్నుపొడిచే విధంగా అటవీ సంరక్షణ నిబంధనలకు అనుమతించేలా చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ నిబంధనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కార్పొరేట్ సంస్థలకు అడవులు, ప్రకృతి సంపదను కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

హైదరాబాద్ సుందే కుటుంబరావు అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ఆదివాసీలకు కనీసం అడవిలో జీవించే హక్కు కూడా లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఇది ఆదివాసీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే అత్యంత ప్రమాదకరమైన తిరోగమన చర్య అని, తక్షణమే అటవీ సంరక్షణ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ సంరక్షణ నిబంధనలు తీసుకురావడం మోడీ సర్కార్ అవలంభిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు పరాకాష్ఠ అన్నారు. వాటికి ప్రకృతి సంపదైన గనులు, విలువైన ఖనిజాలను దోచిపెట్టడమే లక్ష్యమన్నారు. వామపక్షాల ఒత్తిడితో యూపీఏ హయాంలో తీసుకువచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అన్ని వర్గాల హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈ చట్టంలో నియమాలు తీసుకొచ్చిందని అన్నారు. గిరిజనుల రక్షణ, వారి అభివృద్ధి కొరకు తీసుకొచ్చిన చట్టాలను ప్రభుత్వం తీసివేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. అడవిని కాపాడుకునేందుకు గిరిజన సంఘాలు, యావత్ ప్రజానీకం ఉద్యమించాలని కూనంనేని పిలుపునిచ్చారు. గుత్తి కోయలు కూడా ఆదివాసీ గిరిజనులేని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, జువారి రమేష్, భూక్యా శ్రీనివాస్, శంకర్, స్వరూప, దస్రు తదితరులు పాల్గొన్నారు.

Next Story