ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేయండి.. సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |

సాంకేతిక కారణాలు, నాణ్యతా ప్రమాణాల పేరుతో కాలయాపన చేయకుండా ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.

ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేయండి.. సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతిక కారణాలు, నాణ్యతా ప్రమాణాల పేరుతో కాలయాపన చేయకుండా ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘రైస్ మిల్లులకు ధాన్యంతో వెళ్ళిన లారీలు సకాలంలో ఖాళీ కాకపోవడంతో వరి ధాన్యం కొనుగోలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ధాన్యం లోడ్ చేయడానికి లారీ ఓనర్లు భయపడుతున్నారు. కాంటా వేసిన ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు లారీల కొరత ఏర్పడంతో కొనుగోలు సెంటర్లలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తిగా మందగించింది. ఫలితంగా రైతులు ధాన్యంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. అలాగే ధాన్యంలో తాలు ఉందని, నాణ్యత లేదనే పేరుతో అనేక కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకుండా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఫలితంగా రైతులు తీసుకెళ్ళిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి పోతున్నాయి. అలాగే కొన్నిచోట్ల రాశులుగా పోసిన ధాన్యం వరదకు కొట్టుకపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాపితంగా మొక్కజొన్న పంట కొనుగోలులో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. మార్కెట్ యార్డులలో మొక్కజొన్నలు కొనుగోలు నిలిచిపోవడంతో గత కొన్ని రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలుకు గన్నీ సంచుల కొరత కూడా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి. వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలను కొనుగోలులో తలెతుత్తున్న సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Next Story