బీఆర్ఎస్‌కు సొంత వ్యూహం లేదు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి ఉపయోగం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌కు సొంత వ్యూహం లేదు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకి ఉపయోగం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అసలు గెలవ వద్దనేది తమ లక్ష్యమని, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌కు సొంత వ్యూహం లేదని, బీజేపీతో ఘర్షణ ఎందుకనే వైఖరితో బీజేపీకి అనుకూలంగా ముందుకు వెళుతుందని ఆరోపించారు. అందులో భాగంగానే గతంలో కేసులు ఉన్నాయని ఉద్దేశంతో పలు కీలక ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వైఖరిని బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అదే వైఖరిని అవలంబిస్తే సైద్ధాంతికంగా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, అందుకే బీజేపీని, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు నిలకడగా లేవని, అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మార్చుకుంటున్నారని, లౌకిక విధానం, సామ్రాజ్యవాదం, మతపరమైన తదితర అంశాల విషయంలో బీజేపీకి అనుకూలమైన వైఖరిని బీఆర్ఎస్ అవలంభిస్తున్నదని తెలిపారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రంతో బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ఏమిటో తెలియదు కానీ అంతర్గతంగా రెండు పార్టీల మధ్య ఏదో స్నేహ ఉన్నట్లు కనబడుతున్నదని ఆరోపించారు.

మావోయిస్టులకు విజ్ఞప్తి..

కొంతమంది మావోయిస్టులు (Maoists) మంచి ఉద్దేశంతో లొంగిపోతున్నారని కూనంనేని అన్నారు. ఇప్పటికీ మావోయిస్టులపై ప్రజలకు అభిమానం ఉందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ, అనంతరం పునర్ విమర్శ చేసుకుని సాయుధ పోరాటాన్ని విరమించిందని గుర్తుకు చేశారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులను అత్యంత భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారన్నారు. మావోయిస్టులు కూడా మంచి ఆలోచన చేసి సాయుధ పోరాటాన్ని విరమించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల త్యాగాలు వృధా కావొద్దని, అందరం కలుద్దాం.. అందరం కలిస్తే దేశానికి మంచి జరుగుతుందని అని కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల గొంతు నులుముతోందని ఆరోపించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, కానీ కమ్యూనిజాన్ని రూపుమాపడం ఆయన తరం కాదని స్పష్టం చేశారు.

Next Story