- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనిజువెలాపై ట్రంప్ అమానుష జోక్యం.. భారత్ ఖండించాలి: సీపీఐ నారాయణ డిమాండ్
అమెరికా అధ్యక్షుడు Donald Trump పాలనలో వెనిజువెలాలో ప్రజల చేత ఎన్నికైన నాయకుడిని అక్రమంగా అపహరించి నిర్బంధించడం ప్రజాస్వామ్యంపై, జాతీయ సార్వభౌమత్వంపై, అంతర్జాతీయ చట్టాలపై జరిగిన తీవ్ర దాడిగా సీపీఐ ఘాటుగా ఖండిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు Donald Trump పాలనలో వెనిజువెలాలో ప్రజల చేత ఎన్నికైన నాయకుడిని అక్రమంగా అపహరించి నిర్బంధించడం ప్రజాస్వామ్యంపై, జాతీయ సార్వభౌమత్వంపై, అంతర్జాతీయ చట్టాలపై జరిగిన తీవ్ర దాడిగా సీపీఐ ఘాటుగా ఖండిస్తోంది. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నేత నారాయణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చర్యకు మాదకద్రవ్యాలు గానీ, నేరాలు గానీ కారణం కాదన్నారు. ఇది పూర్తిగా సామ్రాజ్యవాద దోపిడీ చర్య అన పేర్కొన్నారు. వెనిజువెలాలో ఉన్న అపార చమురు వనరులు, ఖనిజ సంపదను కబళించాలనే అమెరికా దురాశే దీనికి మూలకారణం అని ఆరోపించారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలపై కుట్రలు, రాజకీయ, సైనిక బెదిరింపులు జరగడం చరిత్రలో పునరావృతం అవుతూనే ఉందని తెలిపారు.
మౌనం అంటే భాగస్వామ్యం వహించినట్టే..
Venezuela ఒక స్వతంత్ర సార్వభౌమ దేశం అని, అక్కడి ప్రజలే తమ నాయకత్వాన్ని నిర్ణయించుకునే పూర్తి హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో, అనేక దేశాలతో సహకారం ద్వారా భారత్ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు పొందుతోందని, కాబట్టి కార్పొరేట్-సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నలిపివేస్తే భారత్ మౌనంగా ఉండకూడదన్నారు. భారత ప్రధాని Narendra Modi తక్షణమే అమెరికా చేసిన అక్రమ చర్యలను బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. జాతీయ సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబాటును ప్రకటించాలన్నారు.
చమురు, ఖనిజ దోపిడీకి దారి తీసే సామ్రాజ్యవాద జోక్యాలను తిరస్కరించాలన్నారు. ఈ సమయంలో మౌనం వహించడం అంటే నైతిక భాగస్వామ్యం వహించినట్టే.. అని తెలిపారు. అసంఘటిత కూటములు లేని విధానం, శాంతి, సార్వభౌమత్వ గౌరవం అనే భారత సంప్రదాయం స్పష్టమైన, ధృఢమైన స్పందనను కోరుతోందని, సామ్రాజ్యవాదాన్ని ఖండించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు.






