- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా.. కార్పొరేట్లకు వరం : CPI MLC
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, కార్పొరేట్లకు వరంగా మారిందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, కార్పొరేట్లకు వరంగా మారిందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, ఇది పూర్తిగా నిరాశజనకమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం బడ్జెట్‌పై ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం నుండి కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నులు వెళ్తున్నప్పటికీ, తిరిగి నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి తెలంగాణ పట్ల వివక్ష చూపిందని ఆయన మండిపడ్డారు. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తకపోవడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో, రైతుల సంక్షేమాన్ని కేంద్రం గాలికి వదిలేసిందని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (MSP) చట్టంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని అన్నారు. ఎరువుల సబ్సిడీలలో కోత విధించడం నల్లగొండ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల రైతులపై పెనుభారం మోపుతుందని వివరించారు.
చేనేత రంగానికి అన్యాయం:
పోచంపల్లి, నారాయణపూర్, పుట్టపాక వంటి ప్రాంతాల్లోని చేనేత కార్మికులు ఎప్పటినుండో కోరుతున్నట్లుగా, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తి వేయకపోవడం శోచనీయమన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగి నేతన్నలు ఇబ్బంది పడుతుంటే, బడ్జెట్‌లో వారికి ఎలాంటి ఊరట కల్పించలేదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితుల పునరావాసానికి లేదా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ బలోపేతానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం విచారకరం. అలాగే రీజినల్ రింగ్ రోడ్ (RRR) భూసేకరణకు సంబంధించి కేంద్ర వాటా నిధులపై స్పష్టత లేదు.
నిరుద్యోగం - ధరల పెరుగుదల:
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం వల్ల నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయని, దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే, యువతకు ఉపాధి కల్పించే నిర్దిష్ట ప్రణాళికలేవీ ఈ బడ్జెట్‌లో లేవని ఆరోపించారు. తెలంగాణకు రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ, విమానాశ్రయాల అభివృద్ధి, భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో కారిడార్, నిరుద్యోగం రూపు మాపేందుకు, ఉద్యోగ, ఉపాధి మార్గాలు, కొత్త జాతీయ రహదారులకు బడ్జెట్ లో ఏమాత్రం కేటాయింపులు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వంపై వివక్ష చూపిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు. యువత, మహిళ సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని CPI MLC నెల్లికంటి సత్యం ఆరోపించారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా అంకెల గారడీ తప్పా.. పేద, మధ్య తరగతి, రైతు, మహిళలకు ఒరిగింది ఏమీ లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చివరగా, ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప, సామాన్య ప్రజలకు, రైతులకు, కార్మికులకు ఒరిగేదేమీ లేదని, ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గళం విప్పుతామని హెచ్చరించారు.






