- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాలు వదిలేస్తా: కమ్యూనిస్టుల కంచుకోటపై కూనంనేని ధీమా
తెలంగాణ రాజకీయాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలపై, రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టుల వ్యూహాలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ గెలుపుపై ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎప్పటికీ అధికారంలోకి రాలేదని కూనంనేని సాంబశివ రావు స్పష్టం చేశారు. కేవలం సెంటిమెంట్, భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయాలు మాత్రమే బీజేపీకి వచ్చని, కానీ అలాంటి విన్యాసాలు తెలంగాణలో అస్సలు పనిచేయవని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఒకవేళ ఖమ్మంలో బీజేపీ ఒక్క సీటైనా గెలిస్తే.. నేను ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను" అంటూ కూనంనేని సంచలన సవాల్ విసిరారు.
పొత్తులపై పంథా మారుస్తాం..
వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తుల వ్యూహం పూర్తిగా మారబోతోందని కూనంనేని వెల్లడించారు. "ఇకపై ఒకటి, రెండు సీట్లు ఇచ్చే పార్టీలతో మేము పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదు. గౌరవప్రదంగా కనీసం ఐదు సీట్లకు తగ్గకుండా ఇచ్చే పార్టీలతోనే రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి" అని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో మినహా, మిగిలిన అన్ని సమయాల్లో కమ్యూనిస్టులంతా (సీపీఐ, సీపీఎం తదితర శ్రేణులు) ఎప్పుడూ కలిసే ఉంటామని, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడతామని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజలకు ఉపయోగపడే, ప్రజా శ్రేయస్సు కోరే రాజకీయాలు మాత్రమే చేస్తారని కూనంనేని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వార్థం, లాభాల కోసం కమ్యూనిస్టులు ఎన్నడూ రాజకీయం చేయరని.. ఒకవేళ ఎవరైనా తమ స్వార్థం కోసం రాజకీయం చేయాలని చూస్తే, వారు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హులు కారని ఆయన గట్టిగా హెచ్చరించారు.






