‘అనుమానం నిజం అవుతోంది’.. CPI ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రధాని మోడీ ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రావడం శుభపరిణామని, అయితే కేవలం వచ్చి వెళ్లడం కాకుండా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో రాష్ట్ర విభజన హామీలను నేరవేర్చి వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్‌ చేశారు.

‘అనుమానం నిజం అవుతోంది’.. CPI ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రావడం శుభపరిణామని, అయితే కేవలం వచ్చి వెళ్లడం కాకుండా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో రాష్ట్ర విభజన హామీలను నేరవేర్చి వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సాధారణ అభివృద్ది పనులు కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. లేకపోతే ప్రధానికి తెలంగాణ పట్ల ఇక్కడి ప్రజల పట్ల ద్వేషం ఉందన్న అనుమానం నిజం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న అత్యంత ప్రమాదకరమైన ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (SIR) పట్ల ప్రజలంతా అప్రమత్తండా ఉండాలని సాంబశివరావు కోరారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ద్వారా బెంగాల్‌, తమిళనాడు, కేరళలో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించారని ఇక్కడ కూడా అదే చేయనున్నారని ఆయన హెచ్చరించారు.

మే 4న రాష్ట్ర వ్యాప్త నిరసనలు..

రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తుల కొరతను నిరసిస్తూ ఈనెల 4వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించనున్నారని, ఈ రెండు కార్యక్రమాల్లో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సహకార సంఘాల పాలకమండళ్లను నామినేట్‌ చేయడం తగదని, ప్రాథమిక సహకార సంఘాల పాలకమండళ్లను నామినేటెడ్‌ పద్దతిలో నియమించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. సభ్యులంతా తమ సభ్యత్వ రుసుం ద్వారా పాలకమండళ్లు ఏర్పాటు చేసుకుని వాటిని వారే నిర్వహించుకుంటున్నారని, వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ అధికారం తప్ప మరే అధికారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సహకార సంఘాల పాలకమండళ్లను నామినేటెడ్‌ పద్దతిలో ఎన్నుకోవడమనేది ప్రజాస్వామ్యానికి విరుద్దమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునర్‌ నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని సీపీఐ స్వాగతిస్తోందని సాంబశివరావు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.11 వేల కోట్లు ఖర్చుపెట్టిన నేపథ్యంలో దానిని అందుబాటులోకి తీసుకురావాలనుకోవడం హర్షణీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం మరమ్మత్తులు చేసి వినియోగంలో తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణమామం అన్నారు. ఆర్‌టీసీపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుని సమ్మెను ఉపసంహరింపజేయడం ద్వారా పెద్ద విపత్తును తప్పించిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను సైతం 100 రోజుల్లో పరిష్కారిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణను కూడా చేపట్టాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలను సైతం సాధ్యమైనంత త్వరలో విడుదల చేసి వారిని ఆదుకోవాలని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు.

యుద్ధం పట్ల స్పందించకపోవడం దారుణం..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్‌ కొనసాగిస్తున్న యుద్ధం పట్ల ప్రధాని మోడీ స్పందించకపోవడం వల్లే దేశ వ్యాప్తంగా చమురు కొరతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని సాంబశివరావు తెలిపారు. ఒక వేళ కొరత లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వేళ ఆయిల్‌ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తే దానిని తక్షణమే కట్టడి చేయాల్నరు. దాదాపు 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ఉన్న ప్రధాని తన మౌనం ద్వారా ఈ దేశ ప్రజలకు లాభం చేస్తున్నారో నష్టం చేస్తున్నారో తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. అమెరికాతో స్నేహాం ఉండొచ్చు కానీ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేన శంకర్‌, బీఎస్‌ బోస్‌ పాల్గొన్నారు.

Next Story