కాంగ్రెస్ తోనే సీపీఐ, సీపీఎం.. బలమైన స్థానాల్లో ఒంటిరిగానే పోటీ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడిరాజుకుంది. మొదటి దశ ఎన్నికల్లో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

కాంగ్రెస్ తోనే సీపీఐ, సీపీఎం.. బలమైన స్థానాల్లో ఒంటిరిగానే పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడిరాజుకుంది. మొదటి దశ ఎన్నికల్లో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తోనే వెళ్లాలని సీపీఎం, సీపీఐ పార్టీలు నిర్ణయించినట్టు తెలిసింది. తమ పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో ఒంటరిగానే పోటిచేయాలని నిర్ణయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటిచేస్తూ వచ్చాయి. అందులో భాగంగానే సీపీఐకి ఎమ్మెల్సీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలు గుర్తులు ఉండకపోవడంతో ఎక్కడిక్కడ అవకాశాన్ని బట్టి ముందుకెళ్లాలని జిల్లా కమిటీలకు ఆదేశాలు జారీచేసినట్టు ఇరు పార్టీల ముఖ్య నేతలు చెబుతున్నారు.

బలమైన గ్రామాల్లో

పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం కంటే గ్రామ స్థాయి నాయకుల ఆధారంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రంగారెడ్డి జిల్లా, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగుడెం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి-భువనగిరి, వరంగల్, హన్మకొండ, ములుగు, మహాబుబాబాద్, ఉమ్మడి మహాబుబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సీపీఐ, సీపీఎం పార్టీలకు కొన్ని గ్రామాలు బలమైన కేంద్రాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు పార్టీల మధ్య కూడా పోటి ఉండే అవకాశాలూలేకపోలేదు. దీంతోపాటు మధిరా నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య నేపథ్యంలో ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశముంది.

ఎక్కడికక్కడే సర్దుబాటు

బలమైన గ్రామాల్లో ఒంటరిగానే పోటిచేయడంతోపాటు అవకాశాలు ఉన్న చోట అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా సర్దుబాటు చేసుకోవాలని జిల్లా కమిటీలకు ఆదేశాలు జారీచేశారు. స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితులు, గ్రామాల అభివృద్ది, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో

సర్పంచ్ ఎన్నికల తర్వాత జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీల పరంగా జరగనుండడంతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలో నిర్ణయించడంతోపాటు జిల్లా స్థాయిలో పోటిచేసే ఎంపీటీసీ, జడ్పీటీసీల ప్రతిపాదించాలని నిర్ణయించారు. దీంతోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మెన్ పదవులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.

Next Story