హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. రైజింగ్ డే వేడుకల్లో సీపీ సజ్జనార్ కీలక హామీలు

by Ramesh Naini |

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. రైజింగ్ డే వేడుకల్లో సీపీ సజ్జనార్ కీలక హామీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం త్వరలోనే సిటీ పోలీస్‌ విభాగంలో ప్రత్యేకంగా 'హోంగార్డ్‌ కో-ఆపరేటివ్ సొసైటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శనివారం పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హోం గార్డ్స్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్‌ పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 5 వేల మంది హోంగార్డులు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. హోంగార్డుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కో-ఆపరేటివ్ సొసైటీలో ఇప్పటికే 2,000 మంది చేరారని, మిగిలిన వారు కూడా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.

హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇండ్లు..

అర్హులైన హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్క హోంగార్డు డ్రైవింగ్ లైసెన్స్‌ను విధిగా రెన్యూవల్ చేసుకోవాలని సీపీ సూచించారు. లైసెన్స్‌ రెన్యూవల్ చేసుకోని పక్షంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బీమా మంజూరులో ఇబ్బందులు తలెత్తుతాయని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతి, అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో మెలిగి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పరేడ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో పాటు, విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 25 మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. విధి నిర్వహణలోనూ, ఇతర కారణాలతోనూ మృతిచెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.

Next Story