- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CP Sajjanar : వాట్సాప్‌లో కొత్త మోసం.. ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త!
వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ‘ఘోస్ట్ పేయిరింగ్’ (Ghost Pairing) అనే ఈ స్కామ్ ద్వారా, వినియోగదారుల వాట్సాప్ ఖాతాలను వారికు తెలియకుండానే హ్యాకర్లు తమ డివైజ్‌లకు లింక్ చేసుకుంటున్నారు. ‘హేయ్.. మీ ఫొటో చూశారా?’ అంటూ వచ్చే లింక్‌లే ఈ మోసానికి ప్రధాన ఆయుధం. అవి తెలిసిన వారి నంబర్‌ల నుంచి వచ్చినట్లే కనిపించినా, పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ అవసరం లేకుండానే, వినియోగదారుడి ఖాతా నేరుగా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది.
ఒక్కసారి ఖాతా వారి చేతికి చిక్కితే, వ్యక్తిగత చాటింగ్‌లు, ఫొటోలు, వీడియోలు అన్నింటినీ వీక్షించడమే కాకుండా, కాంటాక్ట్స్ లిస్ట్‌ను దొంగిలిస్తారు. అంతేకాదు, బాధితుడి పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. చివరకు అసలు ఖాతా యజమానినే వాట్సాప్ వాడలేని పరిస్థితికి తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. ట్వీట్ ఇదే..
భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ పరిశీలించాలి. తెలియని డివైజ్‌లు కనిపిస్తే వెంటనే తొలగించాలి. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి. ఒక చిన్న అజాగ్రత్తతోనే మొత్తం వాట్సాప్ ఖాతా హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకుని, అందరినీ అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు.






