CP Sajjanar: 50 లక్షల మంది ఐబొమ్మ యూజర్ల డేటా చోరీ.. సీపీ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడి

by Prasad Jukanti |   (  Updated:2025-11-17 07:11:10  IST  )

ఇమ్మడి రవి అరెస్టుపై సజ్జనాల్ కీలక విషయాలు వెల్లడించారు.

CP Sajjanar:  50 లక్షల మంది  ఐబొమ్మ యూజర్ల డేటా చోరీ.. సీపీ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పైరసీ అనే భూతం ప్రపంచాన్ని పట్టి పీడీస్తోందని హైదరాబాద్ సీపీ వీ.సీ సజ్జనార్ అన్నారు. పైరసీ మాస్టర్ మైండ్ ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని వెల్లడిచారు. ఇవాళ ఉదయం సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ స్టార్స్ కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితర సీనీ పెద్దలు సీపీని కలిశారు. ఈ సందర్భగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్ ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‍లో మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టామని ఈక్రమంలో ఇమ్మడి రవిని అరెస్టు చేసి ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. అంతకు ముందు పైరసీ కేసులో శివరాజ్, ప్రశాంత్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పైరసీకి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించామన్నారు.

రవి హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు:

ఇమ్మడి రవి సమాజానికి పైరసీతో నష్టం కలిగించడం ఒక ఎత్తైతే వాటిలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ రెండు రకాలుగా నష్టం కలిగించాడని వెల్లడించారు. పైరసీకి సంబంధించిన ఒక వెబ్ సైట్ బ్లాక్ చేస్తే మరో మిర్రర్ వెబ్ సైట్ ప్రారంభించారని ఇలా 65 మిర్రర్ వెబ్ సైట్స్ చేశారని, రవిని అదుపులోకి తీసుకుని దర్యాప్తులో భాగంగా ఆయన హార్డ్ డిస్క్ రికవరీ చేస్తే అందులో 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ అనే మూవీ నుంచి ఇటీవల వచ్చి ఓజీ వరకు ఆయన హార్డ్ డిస్క్ లో ఉన్నాయన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మూవీలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పైరసీ, బెట్టింగ్ ల ద్వారా ఇప్పటి వరకు రూ.20 కోట్లు ఆర్జించానని వెల్లడించారని అందులో రూ.3 కోట్లు సీజ్ చేశామన్నారు. ఇమ్మడి రవి ఆర్థిక లావాదేవీల కూపీ లాగేందుకు ఆయనను పోలీస్ కస్టడీకి కోరామన్నారు.

ఐబొమ్మ యూజ్ చేసిన 50 లక్షల మంది డేటా:

ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని విదేశాల దేశాల నుంచి ఈ వెబ్ సైట్స్ ఆపరేట్ చేశారని అందువల్ల ఈ కేసులో సీబీఐ, ఈడీని అప్రమత్తం చేశామన్నారు. పైరసీ వెబ్ సైట్లను సందర్శించిన వారికి చెందిన దాదాపు 50 లక్షల మందికి చెందిన డేటా మొత్తం ఇమ్మడి రవి వద్ద ఉందని ఈ డేటాను డార్క్ వెబ్ సైట్లు, సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నారని వెల్లడించారు. డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగిందని ఈ డేటా అంతా ఇలాంటి వారి వద్ద ఉండటం ప్రమాదకరం అన్నారు.

కరేబియన్ కంట్రీలో పౌరసత్వం:

విశాఖకు చెందిన ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివారని ఇతను మొదటి నుంచి మారు పేర్లు పెట్టుకున్నారు. తొలుత మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్ల అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే పేరుతో ఆంధ్రప్రదేశ్ లోనూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఇతడికి మొదటి నుంచి క్రిమినల్ మైండ్ సెట్ ఉందని అలాగే డేటా విషయంలో ఆయనకు మంచి పట్టు ఉందని చెప్పారు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ అనే దేశం పౌరసత్వం పొందారని చెప్పారు. ఇతను 2019 నుంచి ఐబొమ్మ వెబ్ సైట్ ను నడుపుతున్నారని ఈ వెబ్ సైట్ ను సందర్శించిన వారి డేటా మొత్తం ఇతని వద్ద ఉందని తెలిపారు. ఉదయం విడుదలయ్యే సినిమాను సాయంత్రానికి తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. ఐబొమ్మ రవి వెబ్ సైట్ డిజైన్, డెవలపింగ్ లో ఆరితేరారని, ఒక సైట్ ను బ్లాక్ చేస్తే మరో సైట్ ను డెవలప్ చేస్తాడని చెప్పారు. సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేస్తాడని చెప్పారు. ఫ్రాన్స్ లో ఉంటున్న రవి అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, థాయ్ లాండ్, దుబాయ్ లో తిరిగేవారని చెప్పారు. ఆయన నెట్ వర్క్ లో ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని కస్టడీకి ఇస్తే ఐ బొమ్మ రవి నుంచి పూర్తి వివరాలు రాబడుతామన్నారు. ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా ఇలాంటి పైరసీ వెబ్ సైట్లను ప్రోత్సహించవద్దని చెప్పారు.

పోలీసులను చాలెంజ్ చేస్తే ఏమవుతుందో తెలిసిందే?

దమ్ముంటే తనను పోలీసులు పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి చేసిన చాలెంజ్ పై సజ్జనార్ స్పందించారు. పోలీసులను సవాల్ చేసిన రవి ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీసులను, ప్రభుత్వాన్ని చాలెంజ్ చేస్తే ఏమవుతుందో ఇమ్మడి రవి అరెస్టుతో అర్థం చేసుకోవాలన్నారు. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రవి ఇప్పుడు అరెస్టు అయ్యారని చెప్పారు. ఇమ్మడి రవి సమాచారం ఆయన భార్యనే పోలీసులకు చేరవేసిందని అందువల్లే హైదరాబాద్ కు వచ్చిన రవిని పోలీసులు పట్టుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సజ్జనార్ ఖండించారు. హైదరాబాద్ పోలీసులకు దశాబ్దాలుగా మంచి నెట్ వర్క్ ఉందని సొంత నెట్ వర్క్ విచారణలో భాగంగానే ఇమ్మడి రవి అరెస్టు అయ్యారన్నారు.

Read More... అలాంటి మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదు.. మీమర్స్‌కు సీపీ సజ్జనార్ హెచ్చరిక

పైరసీపై సజ్జనార్ చూపిన చొరవ అభినందనీయం: చిరంజీవి

Next Story