- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దాయన పోలీసుల కంటే ఆ మోసగాళ్లనే ఎక్కువగా నమ్మాడు! సీపీ సజ్జనార్ ఆవేదన
పెద్దాయన పోలీసుల కంటే ఆ మోసగాళ్లనే ఎక్కువగా నమ్మాడు అని సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్ల సైకలాజికల్ బ్రెయిన్ వాష్‌కు ఇదొక సజీవ ఉదాహరణ అంటూ హైదరాబాద్ నగర్ కమిషనర్ సజ్జనార్ ఓ వార్తను పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఆ వార్తను షేర్ చేశారు. ఈ వార్త చదివితే ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతోందని ఆవేదన చెందారు. 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించారని తెలిపారు. మొదటిసారి ఆయనను అదృష్టవశాత్తూ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు ఆపి.. సైబర్ మోసగాళ్ల ఖాతాలను చూపించి మరీ అవగాహన కల్పించి రూ.72 లక్షలు కాపాడారని వెల్లడించారు. కానీ విచిత్రం ఏంటంటే.. 15 రోజుల తర్వాత మళ్లీ అదే గ్యాంగ్ కాల్ చేస్తే, ఆ పెద్దాయన పోలీసుల కంటే ఆ మోసగాళ్లనే ఎక్కువగా నమ్మాడు అని పేర్కొన్నారు. బ్యాంక్ వాళ్ళకి అబద్ధాలు చెప్పి మరీ రూ.49 లక్షలు వాళ్లకు సమర్పించుకున్నాడని వెల్లడించారు. చదువుకున్న వాళ్లు, లోకజ్ఞానం ఉన్నవాళ్లు కూడా ఇలా ఎందుకు మోసపోతున్నారు? ఎందుకంటే.. సైబర్ క్రిమినల్స్ ముందుగా మీ అకౌంట్‌ను కాదు, మీ ఆలోచనా శక్తిని హ్యాక్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వాళ్లు ఆడుతున్న మైండ్ గేమ్‌కు ఈ ఘటనే సజీవ సాక్ష్యం.. అని సజ్జనార్ వివరించారు.
దయచేసి ఇవి గుర్తుంచుకోండి..
'డిజిటల్ అరెస్ట్' అనే పదం మన చట్టాల్లోనే లేదు!
సీబీఐ, ఈడీ, పోలీసుల పేరుతో ఏ దర్యాప్తు సంస్థ వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్స్ చేసి విచారించదు.
కేసు మాఫీ చేస్తామని ఏ నిజమైన అధికారులు డబ్బులు అడగరు. అలా అడిగారంటే వాళ్లు 100% సైబర్ క్రిమినల్స్ అని ఫిక్స్ అయిపోండి.
మీ పేరిట ఉన్న పార్సిల్స్ పట్టుబడ్డాయని, మనీ లాండరింగ్ జరిగిందని కాల్ రాగానే భయపడకండి. "నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం?" అని వెంటనే కాల్ కట్ చేయండి.
ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేయండి లేదా దగ్గర్లోని పోలీసులను ఆశ్రయించండి.
దయచేసి అప్రమత్తంగా ఉండండి.. మీ ఇంట్లోని పెద్దలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ విషయాన్ని వివరించి వారిలో అవగాహన కల్పించండని ట్వీట్‌లో సీపీ సజ్జనార్ వివరించారు.






