- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది దశకు గోశాల పాలసీ రూపకల్పన.. కేబినెట్‌లో ప్రవేశపెట్టే చాన్స్!
గోశాల పాలసీ రూపకల్పన తుది దశకు చేరుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గోశాల పాలసీ రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ ఎదుట ఈ పాలసీని ప్రవేశపెట్టే అవకాశముంది. ఇష్టానుసారంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల గోవులు సైతం మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న గోశాలల నిర్వహణ, వాటి పాలసీలపై అధ్యయనం చేసి ప్రత్యేక పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యతలను పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గోశాలల నిర్వహణ బాగుందని, అక్కడ ప్రత్యేక పాలసీలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
అప్రోచ్ పేపర్‌ను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అధికారులను ప్రశంసించిన సీఎం.. ఫుల్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. ఇప్పుడు గోశాల పాలసీ తుది దశకు చేరినట్లు తెలిసింది. ఆ శాఖ మంత్రి మరోసారి పరిశీలించాక కేబినెట్ ముందుకు వెళ్లనుంది. ఈ పాలసీలో ప్రధానంగా గోవుల సంరక్షణ, గోశాలల నిర్వహణ, అనుమతులు, స్థిరత్వం, అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న దీనిని ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా రూపొందిస్తున్నారు. గోశాలల పాలసీలో గోశాల నిర్వాహకులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను టైఅప్ చేసే విధంగా కూడా పాలసీలో అంశాలు ఉండనున్నాయని తెలిసింది. పాలసీ గురించి కేబినెట్ లో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారా? మరేమైనా సూచనలు చేస్తారా అనేది ఈనెల 25న జరిగే సమావేశం తర్వాత స్పష్టం కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 306 గోశాలలు
రాష్ట్ర వ్యాప్తంగా 306 గోశాలలు ఉన్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా గోశాలలు ఉన్నాయి. వాస్తవంగా కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు లాంటి సంస్థల నిబంధనల ప్రకారం నగరాల్లో గోశాలలు ఉండడానికి వీలు లేదు. కానీ నగరంలో అనేక చోట్ల గోశాలలను ఏర్పాటు చేశారు. నగరాల్లో జనావాసాల మధ్య, అతి తక్కువ స్థలంలో పెద్ద సంఖ్యలో గోవులను పోషించడం చాలా కష్టమని, వాటికి సరైన స్థలం లేకపోవడంతో గోవులు మరణించడానికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే ఒక్కో గోవు ఉండడానికి మూడు చదరపు మీటర్ల స్థలం ఉండాలి. ఏడు చదరపు మీటర్ల బహిరంగ ప్రదేశం ఉండాలి. ఇలా ఉంటేనే అవి నిలబడటానికి పడుకోవడానికి, ఇతర సమయాల్లో తిరగడానికి అనువుగా ఉంటుంది. అప్పుడే అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. దీంతోపాటుగా తినడానికి 30 నుంచి 40 కేజీల గడ్డి అందించాల్సి ఉండగా, సగటున ఐదు నుంచి పది కేజీల వరకు మాత్రమే ఇస్తున్నారని, దీంతో అవి ఆకలికి అలమటించి, అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని అంచనా వేస్తున్నారు.
కొందరు వయసు మళ్లిన వాటిని తీసుకువచ్చి గోశాలల్లో వదులుతున్నారని, వాటికి సరైన గాలి, వెలుతురు, తిరగడానికి స్థలం లేక ఒకే దగ్గర ఉండిపోయి అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని గుర్తించారు. నగరంలో ఉండటంతో వాటి పేడ, మూత్రం వాసనతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. అదే సమయంలో వాటికి వేసే గడ్డి తిన్న తరువాత మిగలగా.. సరైన నిర్వహణ లేకపోవడంతో అది కాస్తా డ్రైనేజీల్లోకి వెళ్లి ఎక్కడో ఒక దగ్గర చిక్కుకోవడంతో.. నగరంలో గోశాలలు ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీల్లో నీరు నిలిచిపోతున్నదని గుర్తించారు. ఇలా నగరంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా, ఏర్పాటు చేయకుండా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
నగరానికి సమీపంలో విశాలమైన ప్రదేశం ఏర్పాటు చేయాలని లేకుంటే అనుమతులు ఇచ్చేది లేదని ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. నగరంలో ఉన్న వాటిని తరలించే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఇది ఎంత వరకు సాధ్యమనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. గోవుల మలం, మూత్రాన్ని శాస్త్రీయంగా వినియోగించుకోవచ్చని, కానీ ఆ కోణంలో ప్రయత్నాలు జరగడంలేదని సైతం విశ్లేషిస్తున్నారు. గో మూత్రంతో పంచకం తయారు చేయవచ్చని, పేడతో బయో గ్యాస్, బయో పెస్టిసైడ్స్ తయారు చేయవచ్చని, వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గుర్తించారు.






