కంచుకోటలో కౌంటర్ పాలిటిక్స్: మేడిగడ్డకు రేవంత్.. జగిత్యాలకు గులాబీ బాస్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో పొలిటికల్ హీట్ ముదిరింది. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు ఆసక్తిని రేపుతున్నాయి

కంచుకోటలో కౌంటర్ పాలిటిక్స్: మేడిగడ్డకు రేవంత్.. జగిత్యాలకు గులాబీ బాస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఈ పొలిటికల్ హీట్ నేడు తారాస్థాయికి చేరుకోనున్నది. ఒకే రోజు, ఒకే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకే జిల్లాలో పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

మేడిగడ్డ టార్గెట్‌గా సీఎం పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, అక్కడే అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం కాటారం మండలంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ వేదిక ద్వారానే రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ పట్ల ఇంకా సానుకూలత ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ప్రజలకు మళ్లీ గుర్తు చేసే వ్యూహంతో మేడిగడ్డ పర్యటనను పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు లక్ష మందితో సభను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరుగుప్రయాణం కానుండటం గమనార్హం.

గులాబీ గూటికి జీవన్ రెడ్డి

దాదాపు ఏడాది తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ వేదికగా గళం విప్పనున్నారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్న సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో బీఆర్ఎస్ ‘జగిత్యాల జైత్రయాత్ర’ పేరుతో సభను నిర్వహిస్తున్నది. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నక్సల్స్ నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర నేటికీ మరువలేనిది. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ తమ సభకు ఈ పేరు పెట్టింది. సభకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా జగిత్యాల పరిసర నియోజకవర్గాల ముఖ్యనేతలను ఇన్‌చార్జిలుగా నియమించి బాధ్యతలు అప్పగించింది. కేటీఆర్, హరీశ్ రావు దగ్గరుండి ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ

గతేడాది బీఆర్ఎస్ ఆవిర్భావ సభను వరంగల్ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత.. హరీశ్ రావుతోపాటు మరికొందరు నేతలపై విమర్శలు గుప్పించగా.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత.. ఈ నెల 25న ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో వివిధ అంశాలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినందున.. హామీలు, పరిపాలనా వైఫల్యాలపై ఎలా మాట్లాడుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి కేసీఆర్ హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుండి సభా ప్రాంగణానికి కేసీఆర్ చేరుకోనున్నారు.

సాయంత్రమే షెడ్యూల్..

బీఆర్ఎస్, కాంగ్రెస్ సభలు ఒకే ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తుండటం విశేషం. ఎండల కారణంగా సాయంత్రం 6 –7 గంటల మధ్యనే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రసంగించే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సభలు, ప్రెస్‌మీట్లను పెద్దగా పట్టించుకోని సీఎం.. కేసీఆర్ బహిరంగసభను మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అదే రోజు, అదే సమయంలో సభను ప్లాన్ చేశారని భావిస్తున్నారు. సవాళ్లకు ప్రతిసవాళ్లు చేయడం, ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గరని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇన్నాళ్లు మేడిగడ్డకు వెళ్లని సీఎం.. కేసీఆర్ సభ ఉన్న రోజే వెళ్లడం వెనక ఆంతర్యమేమిటని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Next Story