Principal posts: ఖాళీ ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Principal posts: ఖాళీ ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జూమ్ ద్వారా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యా డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ కోసం గత నెల 16న 53 ఖాళీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా, 31 మంది జూనియర్ లెక్చరర్లు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 31 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదించిన జాబితాలోని అర్హులైన జూనియర్ లెక్చరర్లు ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు. కౌన్సెలింగ్ పూర్తిగా సీనియారిటీ-కమ్-రోస్టర్ పద్ధతిలో పారదర్శకంగా జరుగనుంది. పదోన్నతి ఉత్తర్వులు పొందిన అభ్యర్థులు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలి, లేనిపక్షంలో పదోన్నతి రద్దవుతుందని అధికారులు సూచించారు.

వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కన్వీనర్‌గా, సంబంధిత జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షిస్తుంది. అభ్యర్థులు ఎటువంటి బయటి ఒత్తిళ్లు తీసుకురాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్ (తాంసీ, తాళమడుగు, గుడిహత్నూర్, నార్నూర్), కుమురం భీం ఆసిఫాబాద్ (జైనూర్, సిర్పూర్-టి, కోరుట్ల, దహేగాం, కెరమెరి, వాంఖడి, రెబ్బన్, బెజ్జూర్), ఖమ్మం (మధిర, ప్రభుత్వ బాలికల కళాశాల), నిర్మల్ (తానూర్, కడెం), యాదాద్రి భువనగిరి (వలిగొండ, మోత్కూరు) తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం తమ పరిధిలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Next Story