ఉపాధి హామీ చట్టంపై తీర్మానాన్ని ఆమోదించిన మండలి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా పేరు మార్చుతూ వీబీజీరామ్ జీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

ఉపాధి హామీ చట్టంపై తీర్మానాన్ని ఆమోదించిన మండలి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా పేరు మార్చుతూ వీబీజీరామ్ జీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చలో భాగంగా గ్రామీణ ప్రాంత పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) యధాతథంగా కొనసాగించాలని కోరుతూ మంత్రి సీతక్క శాసనమండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

కోట్లాది మందిపై ఈ చట్టం ప్రభావం

ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్రమే పూర్తి నిధులు కేటాయించేదని, కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడమేనని సీతక్క పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారుండగా, అందులో 62 శాతం మహిళలు ఉన్నారు. కొత్త చట్టం వల్ల ఈ వర్గాల ఉపాధికి హామీ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం కింద రాష్ట్ర వాటా 532.13 కోట్లు కాగా, వీబీజీరామ్ జీ కింద రాష్ట్ర వాటా రూ.2320.10 కోట్లుగా ఉందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 1789 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కేంద్రం వంద రోజుల నుంచి 125 రోజులు పనిదినాలు చేశామని గొప్పలు చెప్పుకుంటుందని, కానీ కేంద్రం అమలు చేసేది 75 రోజులేనని స్పష్టం చేశారు. మిగతా 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం పనికల్పించాలని ఉంటుందన్నారు. వ్యవసాయ కూలీలకు హాలీడే కల్పించారని, కొత్త చట్టాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాలని మంత్రి కోరారు. కోట్లాది మంది పేదలపై ఈ చట్టం ప్రభావం చూపుతుందని తెలిపారు. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానం మండలిలో పలువురు సభ్యులు ఆమోదం తెలిపారు.

Next Story