దగ్గు, జలుబు మందుల వినియోగంలో జాగ్రత్త!.. కేంద్రం హెచ్చరికలతో DMHOలు అలర్ట్

by Gantepaka Srikanth |

దగ్గు మందులపై అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

దగ్గు, జలుబు మందుల వినియోగంలో జాగ్రత్త!.. కేంద్రం హెచ్చరికలతో DMHOలు అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దగ్గు మందులపై అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో దగ్గు మందుల వినియోగంపై జిల్లా వైద్యాధికారులు అవగాహన కల్పించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. కాఫ్‌ సిరప్‌ల తయారీలో వాడే గ్లైకాల్‌, ప్రొపిలిన్‌ గ్లైకాల్‌, సోర్బిటాల్‌ వంటి ద్రావకాలు విషపూరిత పదార్థాలు కాకుండా ఉండేలా తప్పనిసరిగా పరీక్షించాలని, వాటి మూలాలు సరైన ధృవీకరణ పొందినవేనని నిర్ధారించుకోవాలన్న కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఆదేశాల నేపథ్యంలో.. దగ్గు, జలుబు మందుల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు దగ్గు, జ్వరాల సమయంలో అవగాహన లేకుండా దగ్గు సిరప్‌లు వాడకూడదని తెలంగాణ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పిల్లల్లో వచ్చే ఎక్కువశాతం దగ్గు వ్యాధులు వాటికవే తగ్గిపోతాయని, మందుల అవసరం ఉండదని తెలిపారు. 2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల లోపు వయసు పిల్లలకూ సాధ్యమైనంతవరకు ఈ మందులు వాడరాదని, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలని సూచించారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం వంటి నాన్‌-ఫార్మకాలజికల్ పద్ధతులు మొదటి ప్రాధాన్యతగా పాటించాలన్నారు. అన్ని ఆసుపత్రులు, క్లినిక్లు సరైన నాణ్యత ప్రమాణాలతో తయారైన ఉత్పత్తులనే ఉపయోగించాలన్నారు. జిల్లా ఆరోగ్యాధికారులు ఈ సూచనలను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రజా ఆరోగ్య సంచాలకుడు ఆదేశించారు. మరోవైపు కోల్డ్‌రిఫ్ సిరప్ (బ్యాచ్ నెం.ఎస్ఆర్-13) వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సిరప్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ (డి.ఇ.జి) కల్తీ ఉన్నట్లు తేలడంతో ఆ సిరప్ ను వాడరాదని ఇదివరకే హెచ్చరించింది.

Next Story