- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి చేన్లలో జీవం.. రైతు బతుకుల్లో వెలుగు.!
చెదురు మొదరుగా కురుస్తున్న వర్షాలు పత్తి చేన్లకు ప్రాణం పోశాయి. దీంతో రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.

దిశ, తుంగతుర్తి : చెదురు మొదరుగా కురుస్తున్న వర్షాలు పత్తి చేన్లకు ప్రాణం పోశాయి. దీంతో రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 31,772 ఎకరాల్లో పత్తి పంట సాగయింది. ఇందులో అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 6,780ఎకరాల్లో సాగవ్వగా అతి తక్కువగా తుంగతుర్తి మండలంలో 3,053 ఉంది. అలాగే మద్దిరాలలో 6,300, జాజిరెడ్డిగూడెంలో 5,833, నాగారంలో 4,350, నూతనకల్ లో 5,456 ఎకరాల్లో రైతాంగం పత్తి పంట సాగు చేసింది. అయితే ఇటీవల నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు పత్తి చేన్ల ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
ముఖ్యంగా ఈసారి వర్షాలు పుష్కలంగా పడతాయనే సంకేతాలు వెలువడడంతో రైతాంగంలో ఉత్సాహం నిండింది. ఈ మేరకు మొదట్లో కురిసిన చెదురు మదురు వర్షాలకు రైతాంగం తమ భూములను సాగు చేసుకుంది. అనంతరం రూ.వేలల్లో ఖర్చు చేసి వరంగల్, ఖమ్మం, గుంటూరు తదితర జిల్లాలతోపాటు స్థానికంగా పత్తి గింజలను కొనుగోలు చేసి విత్తారు. అనంతరం వర్షాలు మొఖం చాటేయడంతో నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి లోపలే విత్తనం చచ్చిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తినప్పటికీ ఎండలకు మాడిపోయాయి. దీంతో రైతుల ఆశలన్నీ ప్రారంభ దశలోనే ఆవిరయ్యాయి. అయినప్పటికీ కూడా ఆశ చావని రైతులు మళ్లీ రూ.వేలు ఖర్చు చేస్తూ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి భూముల్లో విత్తారు. కాగా నాటి నుంచి వర్షాలు పడుతుండడంతో విత్తనాలు మొలిచాయి. క్రమక్రమంగా ఎదుగుతుండడంతో రైతాంగం ఉత్సాహంతో ఉంది.
వరిసాగుకు అనుకూలించని పరిస్థితులు..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ వర్షాలు ఆశించినంత స్థాయిలో పడకపోవడంతో వరి సాగుకు అడ్డంకిగా మారింది. ప్రతి ఏటా ఖరీఫ్‌లోగాని, రబీ సీజన్ లలో గాని వరి సాగు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలను పరిశీలిస్తే తుంగతుర్తి నుంచే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఇప్పటివరకు అలాంటి పరిస్థితులు ఏమి లేకుండా పోయాయి. బోర్లు, బావుల కింద జరుగుతున్న సేద్యం మినహాయిస్తే మిగతా చోట్ల సేద్యం ముందుకు సాగడం లేదు. రైతులు శ్రీరామ్ సాగర్ రెండవ దశ నీటిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాకు నీళ్లు అందించి జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో తగినంతగా నీటిమట్టం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే పైనుంచి (కరీంనగర్, వరంగల్ జిల్లాల) ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి వస్తేనే సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల సాధ్యపడనుంది.






