- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఆఫీసు తరహాలో మంత్రుల చాంబర్లు.. ఒక్కరూ తగ్గట్లే!
సీఎం ఆఫీసు తరహాలో ఇద్దరు సీనియర్ మంత్రులు తమ కాన్ఫరెన్స్ హాళ్లలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం ఆఫీసు తరహాలో ఇద్దరు సీనియర్ మంత్రులు తమ కాన్ఫరెన్స్ హాళ్లలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఓ వైపు చెప్తూనే.. మరోవైపు మంత్రులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఎల్ఈడీ స్క్రీన్స్ ను ఏర్పాటు చేయాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే.. తప్పని పరిస్థితుల్లో సంబంధిత శాఖ అధికారులు టీవీలను పక్కన పెట్టి.. ఎల్ఈడీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారని సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆరో అంతస్తు తరహాలో..
కొత్త సెక్రెటేరియట్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఆరో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్‌లో వీడియో కాన్ఫరెన్స్ కోసం పత్యేకంగా ఓ హాల్‌ను ఏర్పాటు చేసి, అక్కడ వీడియో కాన్ఫరెన్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు, మూడు సార్లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద టీవీలను తొలగించి, ఎల్ఈడీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్స్‌ను చూసిన ఓ సీనియర్ మంత్రి తన చాంబర్‌లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదని, సీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన తరహాలోనే ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని తన శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో చేసేదేమి లేక ఆయన ఆదేశాల మేరకు మంత్రి చాంబర్‌లో వారంలో రోజుల్లో కొత్త స్క్రీన్స్ బిగించారు.
ఒకరిని చూసి మరొకరు..
ఈ మధ్య ఓ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేందుకు అక్కడకి వెళ్లిన మరో సీనియర్ మంత్రి.. అక్కడ కనిపించిన ఎల్ఈడీ స్క్రీన్స్‌ను ఆసక్తిగా గమనించారు. కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత చాంబర్‌కు తిరిగి వచ్చిన సదరు సీనియర్ మంత్రి తన పేషీ అధికారులను పిలిచి, కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో ఆ పేషీ అధికారులు జీఏడీ అధికారులను సంప్రదించగా, అంతటి బడ్జెట్ కేటాయించడం కష్టం అని చెప్పినట్టు తెలిసింది. దీంతో సదరు పేషీ స్టాఫ్ మంత్రి ఆదేశాల మేరకు తమ శాఖకు చెందిన హెచ్‌వోడీ అధికారులకు విషయం వివరించారు. దీంతో ఉన్నపళంగా హెచ్‌వోడీ అధికారులు తమ సొంత బడ్జెట్‌తో మంత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్ఈడీ స్క్రీన్స్ బిగించారు. ‘మా సార్ రెగ్యులర్‌గా జిల్లాకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెడుతారు. టీవీ స్క్రీన్‌లో కాన్ఫరెన్స్ క్లారిటీగా కనపడటం లేదు. అందుకే ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ వివరించారు. ఒక్కో ఎల్ఈడీ స్ర్కీన్ ఏర్పాటుకు రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుందని ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేసేందుకు నెలల కొద్దీ జాప్యం చేస్తున్న సర్కారు.. మంత్రుల అవసరాల కోసం మాత్రం వెంటనే నిధులను రిలీజ్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.






