TG Govt: కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్.. ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు

by Prasad Jukanti |

ప్రభుత్వ వసతి గృహాల్లో సేవలు, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

TG Govt: కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్.. ఇకపై నేరుగా  విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో (Government Hostels) మెరుగైన సేవలు అందించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ కె.రామకృష్ణరావు (CS Ramakrishna Rao) ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ బుక్స్, నోట్ బుక్స్ యూనిఫామ్స్, బెడ్ షీట్లు కార్పెట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సరుకుల క్వాలిటీ విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించాలని తదనుగుణంగా అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే:

విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీల (Carmatic Charges) చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకు తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. విద్యార్థులు తమకు కావాల్సిన కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఎస్ సి డెవలప్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శి డా.ఎ వర్షిణి, సెర్ప్ సీఈవో దివ్య, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story