ఆర్వోఆర్-2020‌తో అవినీతి లీలలు.. అమ్మేసిన భూములకు మళ్లీ పాస్ బుక్కులు

by Kema Shiva Kumar |

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆర్వోఆర్-2020‌తో అవినీతి లీలలు.. అమ్మేసిన భూములకు మళ్లీ పాస్ బుక్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరణి పోర్టల్, ఆర్వోఆర్-2020 లొసుగులను ఆధారంగా చేసుకొని పాత పట్టాదారుల పేర్లను తిరిగి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. దశాబ్దాల క్రితం అమ్మేసిన భూములకు మళ్లీ పాస్ బుక్కులు జారీ చేశారు. చేతులు మారితే చట్టబద్ధత వస్తుందని.. దగ్గరుండి మరీ సక్సెషన్ చేయించారు. పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొనుక్కున్న పేద, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచారు. ఆ తర్వాత ప్లాట్ల యజమానులకు తెలియకుండానే.. పాత ఓనర్లు ఆ భూములను మళ్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా విక్రయిస్తున్నారు. ప్లాట్ల యజమానులు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినా రెవెన్యూ శాఖలో పట్టించుకునే వారే కరువయ్యారు.

చేతులు మారుతున్న రూ. కోట్లు

నాలా కన్వర్షన్ చేయించకుండానే వ్యవసాయ భూములను వందలాది లే అవుట్లు చేసి ప్లాట్లుగా అమ్మేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేద, మధ్య తరగతి ప్రజలు అనేక వాటిని కొనుగోలు చేశారు. అన్నీ 200, 300, 400 గజాల ప్లాట్లే. అయితే ప్లాట్లను రెవెన్యూలో మ్యుటేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సేల్ డీడ్స్ ఉంటే సరిపోతుందని, డిమాండ్ బాగా పెరిగిన తర్వాత తిరిగి అమ్మేస్తే సరిపోతుందనుకున్నారు. కాని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ధరణి మొండి చేయి చూపించింది. ధరణి లొసుగులు, అధికారుల తీరుతో పాత పట్టాదారులే మళ్లీ హక్కులు పొందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, కడ్తాల్, ఇబ్రహింపట్నం, శంషాబాద్, గండిపేట మండలాల్లో చోటు చేసుకున్న ఈ దందా వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు తెలుస్తున్నది. అందుకే రెవెన్యూ అధికారులు ప్లాట్లను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పాత రికార్డుల ఆధారంగా..

ఒక్క మహేశ్వరం మండలంలోనే ప్లాట్లుగా మారిన వందలాది ఎకరాలకు రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు జారీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పాత పేర్లనే కొనసాగించారు. కానీ ఆ భూమి నాన్ అగ్రికల్చర్ గా మారిందని, ప్లాట్లుగా అమ్మేశారని తెలిసినా పట్టించుకోలేదు. 2000 నుంచి ఆ సర్వే నంబర్ల ఈసీ చూసినా తెలుస్తుంది. కానీ మహేశ్వరం తహశీల్దార్, కందుకూరు ఆర్డీవోలు మాత్రం వందలాది ఎకరాలకు పాసు పుస్తకాలు జారీ చేశారు. ప్లాట్లుగా అమ్మినట్లుగా చూపించే అధికారిక ఆధారాలను పట్టించుకోలేదు. పాత పహానీల్లో కొనసాగుతున్న వారు దరఖాస్తు చేసుకోగానే మ్యుటేషన్ చేశారు. కొందరు పట్టాదారులు చనిపోతే పెండింగ్ మ్యుటేషన్, సక్సెషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత పాత యజమానులు ప్లాట్లు చెడగొట్టి తిరిగి అదే భూమిని వ్యవసాయ భూమిగా గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. ఓ వైపు ప్లాట్లుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మరో వైపు వ్యవసాయ భూమిగా రెవెన్యూ శాఖ.. సమాంతరంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. ఒక్కటే భూమి.. స్టాంప్ డ్యూటీ కట్టించుకొని రెండు రకాలుగా అమ్మకాలు సాగించడానికి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలిసే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు రూ.లక్షల్లో తీసుకొని సేల్ డీడ్స్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్లాట్లుగా మారిన భూమిని వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. ఈ విషయంపై కొందరు ప్లాట్ల యజమానులు లిఖితపూర్వకంగా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేశారు.

అడిగితే బెదిరింపులే..

ఈ భూమిని లే అవుట్ చేస్తే తాము కొనుగోలు చేశామని ఎవరైనా వస్తే బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ల్యాండ్ దగ్గరికి కూడా వెళ్లనివ్వకుండా బౌన్సర్లను పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు వైపు కన్నెత్తి కూడా చూడొద్దని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలంటూ చెబుతున్నారని వాపోతున్నారు. దీనికి కొందరు రాజకీయ పలుకుబడి ఉన్న వారు పరోక్షంగా రియల్టర్లకు సహకరిస్తున్నారని తెలిసింది. పెద్ద లీడర్లు ఈ దందాలో ఉండడం వల్లనే స్థానిక రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ధరణిలో స్లాట్ బుకింగ్ ప్రకారమే తాము చేస్తున్నామని, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. అయితే కొందరు ప్లాట్ల యజమానులు గట్టిగా ప్రశ్నిస్తే సేల్ డీడ్ ఇస్తే రూ.లక్ష, రూ.2 లక్షల వరకు ఇచ్చేస్తున్నారు. దీంతో ఏం చేయలేక ఇక ఎంత వస్తే అంత చాలనుకుంటూ సేల్ డీడ్ చేతికి అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందల ప్లాట్ల సేల్ డీడ్స్ కాపీలను సేకరించినట్లు తెలిసింది.

పెండింగ్ మ్యుటేషన్ రిజెక్ట్

ప్లాట్ల యజమానులు తమ స్థలాన్ని పెండింగ్ మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకుంటే ఒకటీ రెండు రోజుల్లోనే రిజెక్ట్ చేసేస్తున్నారు. అదే పాత పట్టాదారుల దగ్గర కొనుగోలు చేయడానికి స్లాట్ బుక్ చేసుకుంటే గంటల్లోనే పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 ఏండ్ల క్రితం ప్లాట్లుగా అమ్మేసిన ల్యాండ్ పై క్రయ విక్రయాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు కోరుతున్నారు. రెండు రకాల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక కొందరు రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాలకు ఊతమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story