- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రెవెన్యూ’లో అవినీతి బాగోతం.. భూ సమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏసీబీ కేసుల్లో పట్టుబడే అధికారులు, స్వాధీనం చేసుకుంటున్న నగదు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొందరు ఆఫీసర్లు లంచాన్నీ ఖరీదైనదిగా మార్చేశారనే చర్చ నడుస్తున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం గుంటకు రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. దీంతో అధికారుల తప్పిదం వల్లనో, సాంకేతిక కారణాల వల్లనో ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరించుకోవడం రైతులు, భూ హక్కుదారులకు తలకుమించిన భారంగా మారింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ.. ఇలా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. భూ సమస్యల పరిష్కారానికి, రైతులకు మెరుగైన సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరు అవినీతి అధికారుల వల్ల రెవెన్యూ శాఖ బద్నాం అవుతున్నదనే చర్చ నడుస్తున్నది.
గుంటకు రూ. లక్ష వరకు..
గతంలో రంగారెడ్డి జిల్లాలో 14 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎమ్వీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై.మదన్ మోహన్ రెడ్డిలు ఏకంగా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. అయితే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం ఆర్ఐ కృష్ణ.. ఏడు గుంటలకు రూ.9 లక్షలు డిమాండ్ చేసి ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఆదిభట్లలో సర్వే నం.355లో 17 గుంటల్లో ఏడు గుంటలు నిషేధిత జాబితాలో ఉంది. దాన్ని తొలగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.9 లక్షలకు బేరం కుదుర్చుకున్న తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం అడిగిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. కొంత కాలం క్రితం మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు కేసు చర్చనీయాంశంగా మారింది. రాంపల్లి దయారాలో సర్వే నం.614లో 19.39 ఎకరాలకు పాసు బుక్ ఇప్పించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరగ్గా.. ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంఘం లీడర్ చెప్పినా..
ఇటీవల ఒక వ్యక్తి డేటా కరెక్షన్ కోసం అప్లయ్ చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించమని తనకు తెలిసిన రెవెన్యూ సంఘం లీడర్ తో సదరు మండల అధికారికి ఫోన్ చేయించుకున్నాడు. అయితే సదరు మండలాధికారి రిపోర్ట్ రాసి ‘డిమాండ్’ చేయడం విశేషం. ఇటీవల ఓ దరఖాస్తు పరిశీలనకు ఎంతో ఒత్తిడి తీసుకొస్తే.. రికార్డులు రాసి సరి చేయాల్సిన పనికి ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. కానీ రిపోర్టు మాత్రం పెండింగు పెట్టారు. ‘రిపోర్ట్ తయారు చేస్తాం. కానీ మీరు ఏం నిర్ణయించుకున్నారు’ అని దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి అడిగారు. ‘నిర్ణయం మీదే కదా. న్యాయం జరిగేటట్టు మీరే రిపోర్ట్ రాయాలి’ అని బాధితుడు రిప్లయ్ ఇచ్చాడు. ఏం నిర్ణయించుకున్నారన్న ప్రశ్న అంతర్లీనం ఎవరికైనా అర్థమవుతుంది. ఐఏఎస్ అధికారులు ఫోన్ చేసినా న్యాయమైన ఫైళ్లను పరిశీలించేందుకు కొందరు ఆఫీసర్లు ససేమిరా అంటున్నారు.
రిజెక్ట్.. కాలయాపన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41 పూర్తిగా పట్టా భూమి. 1954 నుంచి పహానీల్లో పట్టాగానే క్లాసిఫికేషన్ ఉంది. కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 41/1 నుంచి 41/44 వరకు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇవన్నీ 1954–55 పహానీ నుంచి ధరణి అమల్లోకి వచ్చే వరకు పట్టాగానే ఉంది. ఇప్పుడిది 343 సబ్ డివిజన్లుగా మారింది. ఇందులో ఎలాంటి కోర్టు కేసులు లేవు. ప్రభుత్వ భూమి, ఇనాం లేనే లేదు. ప్రభుత్వం ఇందులో సేకరించలేదు. సీలింగ్ సర్ ప్లస్ కాదు. ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఎవాక్యూ, బోనావెకెన్షియా వంటివేవీ లేవు. ఈ వివరాలన్నీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంపారు. ఆ తర్వాత సమస్య పరిష్కారంపై ఫాలో అప్ చేయడం మానేశారు. రైతులకు న్యాయం చేసేందుకు అధికారులు మానవతా దృక్పథంతో ఫాలో చేసి పరిష్కరించేందుకు కృషి చేయాలి. కానీ రిపోర్ట్ పంపామని చేతులు దులిపేసుకున్నారు. ఏండ్లుగా 48 దరఖాస్తులు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు ఎన్నెన్నో ఉన్నాయి. బాధిత రైతులకు అండగా నిలవాల్సిన కింది స్థాయి అధికారులు కాలయాపన చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు.
ఉద్దేశ్యపూర్వకంగానే..!
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరులో చాపల నర్సింహులు తన భూమిని కొడుకులు, వారసులకు సేల్ డీడ్ చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 29న అప్లికేషన్ నంబర్లు 2500367638, 2500367713, 2500367820, 2500367418, 2500367509 ద్వారా మధ్యాహ్నం 1.45 నుంచి స్లాట్స్ బుక్ అయ్యాయి. ఇందులో కొనుగోలుదార్ల ఆధార్ కార్డుకు, వారి మొబైల్ నంబర్లు సీడ్ అయి ఉన్నాయి. కానీ అమ్మకందారు 83 ఏండ్ల నర్సింహులుకు ఫోన్ లేదు. ఆయన ఆధార్ కు ఏ మొబైల్ నంబర్ సీడ్ కాబడలేదు. అయితే క్రయ విక్రయాల్లో ఈ ప్రస్తావన అవసరమే లేదు. ఫింగర్ ప్రింట్ తీసుకొని చేయొచ్చు. కానీ కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలోని ఆపరేటర్ తాను ఓటీపీ ద్వారానే సేల్ డీడ్ చేస్తానంటూ పేచీ పెట్టారు. ఆయన వృద్ధుడు, ఫోన్ లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. నిజానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓటీపీతోనే చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రం మొండి వాదన చేస్తూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వెనుక ఏమై ఉంటాయో ఎవరైనా అంచనా వేయొచ్చు.
తమ కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ పని చేయడం లేదని అబద్ధం చెప్పారు. అసలు డిజిటల్ సంతకం చేయకపోతే కంప్యూటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్లదు. తహసీల్దార్/జాయింట్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇక్కడ ఎందుకు ఓటీపీ ద్వారానే చేస్తామని నిలిపివేశారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆపరేటర్లు, రెవెన్యూ అధికారులు తలచుకుంటే పని చేయొచ్చు. నిలిపివేసేందుకు కారణాలు కూడా వెతకొచ్చు. కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతులు, కొనుగోలుదార్లను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహారణ చాలు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్ మధ్య టైంను ఎవరు గమనించినా, తహసీల్దార్ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫీడ్ ను పరిశీలించినా.. ఎవరెవరు ఎన్నిసార్లు తిరిగి వెళ్లారో తెలిసిపోతుంది.






