- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్పొరేట్ చేయూత
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సాయంతో ముందుకు వచ్చాయి.

- విద్యాశాఖతో రహేజా, రామ్ కీ, యశోద ఫౌండేషన్ల ఒప్పందం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
- సీఎస్ఆర్ నిధులతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు సరికొత్త ప్రాంగణాలు, మౌలిక వసతులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సాయంతో ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాంగణాల నిర్మాణం కోసం రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ సంస్థలు రాష్ట్ర విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోద గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు తాము కేటాయించిన నిధులకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
రూ.కోట్లతో పాఠశాలల ఉన్నతీకరణ
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సకల వసతులతో కూడిన కొత్త భవనాలను నిర్మించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. రామ్ కీ ఫౌండేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతుల కొత్త ప్రాంగణ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం వాటాగా రూ.19.66 కోట్లను రామ్ కీ సంస్థ భరించనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు, అలాగే ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చులో 40 శాతం వాటాగా రూ.10.4 కోట్లను ఈ సంస్థ కేటాయించింది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అవసరమైన ఆధునిక వసతులు, తరగతి గదుల నిర్మాణం కోసం రహేజా గ్రూప్ ఏకంగా రూ.50.50 కోట్లను పూర్తిగా భరించనుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ లోని ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రీ-ప్రైమరీతో పాటు 6, 7 తరగతుల గదుల నిర్మాణం, వసతుల కోసం యశోద సంస్థ రూ. 12.20 కోట్లను వెచ్చించనుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఛైర్మన్ సి. శేఖర్ రెడ్డి, తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






