Corona భయమేనా? తెరుచుకోని బల్దియా పార్కుల క్యాంటీన్‌లు

by Disha Web Desk 4 |
Corona భయమేనా? తెరుచుకోని బల్దియా పార్కుల క్యాంటీన్‌లు
X

దిశ, సిటీబ్యూరో : కరోనాతో గడగడలాడిన ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి చేరినా, జీహెచ్ఎంసీకి మాత్రం ఇంకా కరోనా భయం పోలేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కనీసం జీతాలు, న్యూస్ పేపర్ల బిల్లులు చెల్లించలేని దీనస్థితి చేరుకున్న జీహెచ్ఎంసీ కరోనాకు మూసేసిన ఐదు పార్కుల క్యాంటీన్లతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని కొల్పోయింది. ఆర్థిక వనరుల కోసం అన్వేషిస్తున్నామని, బల్దియాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పకునే జీహెచ్ఎంసీ అధికారుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. జీహెచ్ఎంసీ నగరంలో క్యాంటీన్‌లున్న దాదాపు ఏడు భారీ తరహా పార్కులను అభివృద్ధి చేసి నిర్వాహణ చేపట్టింది.

వీటిలో ఇమ్లిబన్ పార్క్ క్యాంటీన్‌ను ఏటా రూ.1.5లక్షలకు, కృష్ణకాంత్ పార్క్ క్యాంటీన్‌ను రూ.10 లక్షలకు, ఇందిరాపార్కు క్యాంటీన్‌ను ఏటా రూ.16లక్షలకు జలగం వెంగళరావు పార్క్, ఏఎస్ రావునగర్ పార్క్, ఈఎస్ఐ ఆస్పత్రి వెనకానున్న కేఎల్ఆర్ యాదవ్ పార్క్‌లను క్యాంటీన్లతో సహా మెయింటేన్ పాతబస్తీలోని మీరాలం చెరువుకు సమీపంలో ఏర్పాటు చేసిన పార్క్ క్యాంటీన్, కిషన్ బాగ్ పార్క్ క్యాంటీన్‌లను లక్షలాది రూపాయల వార్షిక ఫీజులకు లీజుకిచ్చారు. కరోనా మహమ్మారి ప్రబలిన 2020 మార్చిలో మూతపడ్డ ఈ క్యాంటీన్లను నేటికీ తెరవలేదు. మరో వైపు ప్రపంచం మొత్తం కూడా కరోనా, ఆ తర్వాత వచ్చిన వేరియంట్లను ఏమాత్రం పట్టించుకకోకుండా పూర్వస్థితికి చేరుకోగా, కరోనా భయం నుంచి బల్దియా అధికారులు ఇంకా బయటకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీటికి ఆదరణ అంతంతమాత్రమే

సిటీలోని మాసాబ్ ట్యాంక్ చాచానెహ్రూ పార్క్ క్యాంటీన్ ఇమ్లిబన్ పార్క్ క్యాంటీన్, కిషన్‌బాగ్ పార్కు క్యాంటీన్లను లీజుకు తీసుకున్న నిర్వాహకులు తాము ఆశించిన స్థాయిలో గిరాకీ రాకపోవటంతో కాంట్రాక్టుకు ఒప్పుకున్న డబ్బు చెల్లించటం కూడా గగనంగా మారిందని వాపోతున్నారు. పదేళ్ల నుంచి జలగం వెంగళరావు పార్క్ క్యాంటీన్, 2020 మార్చి నుంచి ఇందిరాపార్క్ క్యాంటీన్‌లు కూడా మూతపడగా, చాచానెహ్రూ పార్క్, ఇమ్లిబన్ పార్క్‌ల్లోని క్యాంటీన్ ఈ క్రమంలో ఇటీవలే బల్దియా అధికారులు కృష్ణకాంత్ పార్క్ క్యాంటీన్ లీజు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. సంవత్సరానికి రూ.9.11 లక్షలకు కేటాయించనున్నట్లు తెలుపుతూ 2020 చివర్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినా, అధికారులు సూచించిన రేటుకు నిర్వాహకులు ముందుకు రాలేదు. అప్పటికీ కరోనాలో కొత్త వేరియంట్లు వస్తుండటంతో జనాల్లో కొంత భయముండేది.

నిరుద్యోగులు ముందుకొచ్చినా...

జీహెచ్ఎంసీకి చెందిన పలు పార్కల్లోని క్యాంటీన్లు లీజుకిస్తున్నారన్న విషయం తెలిసీ వచ్చిన నిరుద్యోగ యువత ముందుకొచ్చినా అధికారులు కేటాయించటం లేదని తెలిసింది. ఎలాగో అలాగా తాము వీటిని నడిపించుకుంటామని, కాంట్రాక్టు విలువ తగ్గించి తమకివ్వాలని కోరినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని పలువురు వాపోయారు. వీటిని వృథాగా వదిలేశారే తప్పా, అడిగిన వారికి కేటాయిస్తే కనీసం పార్కు మెయింటెనెన్స్ ఖర్చులో కొంత వరకైనా ఆదాయం సమకూరుతుందన్న దిశగా ఆలోచించకపోవటం వారి పనితీరుకు నిదర్శనం.

ఇవి కూడా చదవండి : కరోనా వారియర్స్‌ను వదలని కమీషన్ రాయుళ్లు.. ముడుపులు ఇవ్వకపోతే ఫైల్ ముందుకు కదిలేదే లేదు!



Next Story