- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ రెడ్కో సోలార్ టెండర్లపై వివాదం.. పొరుగు రాష్ట్రాల కంపెనీలకు రెడ్ కార్పెట్!
టీజీ రెడ్కో సోలార్ టెండర్ల నిబంధనలు లోకల్ వెండార్లకు షాకిచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో స్థానిక వెండార్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. తెరవెనక కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందాలతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే యత్నం కనిపిస్తున్నది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిర్మించనున్న సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనుల టెండర్లలో టీజీ రెడ్కో(తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 18 సబ్‌స్టేషన్లలో 19 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో టెండర్లు పిలిచింది. ఇందులో పొరుగు రాష్ట్రాల కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూనే తెలంగాణ వెండార్లకు ఎంట్రీ దొరకకుండా అర్హతల పేరుతో కఠినమైన నిబంధనల మెలికలు పెట్టారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ డిస్కంలు టెండర్లు పిలిచినా ప్రాజెక్టు సామర్థ్యంలో కేవలం 50 శాతం ముందస్తు అనుభవం ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, టీజీ రెడ్కో మాత్రం క్లస్టర్ సామర్థ్యానికి సరిగ్గా 100 శాతం అనుభవం ఉండాలనే నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇది కేవలం బడా కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా, లోకల్ వెండార్లను టెండర్ రేస్ నుంచి తప్పించేలా రూపొందించిన గూడుపుఠాణి అని సోలార్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
లోపాయికారీ ఒప్పందాలు..
టెండర్ రూల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం పొరపాటు కాదని, ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని అర్థమవుతున్నది. టెక్నికల్ కన్సార్టియంకు అనుమతిచ్చి, ఫైనాన్షియల్ కన్సార్టియంను పూర్తిగా నిషేధించడం వెనక బలమైన కారణం ఉంది. ఇద్దరు, ముగ్గురు స్థానిక చిన్న సంస్థలు కలిసి గ్రూపుగా ఏర్పడితే టెండర్లు దక్కించుకుంటారని భయపడిన అధికారులు.. లీడ్ బిడ్డర్ మాత్రమే రూ.12కోట్లు లేదా రూ.9కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలనే కండీషన్ పెట్టారు. అంటే, స్థానిక సంస్థల టర్నోవర్లను కలపకుండా వారిని విడదీసి రేస్ నుంచి తప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో కేంద్రం బ్లాక్ లిస్ట్ చేసిన కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు ఎలాగైతే అప్పట్లో ప్రాధాన్యమిచ్చారో, ఇప్పుడు కూడా అలాంటి బడా కంపెనీలకు ముడుపుల కోసం ఈ నిబంధనల మార్పు జరిగిందనే చర్చ సోలార్ రంగంలో జోరుగా సాగుతున్నది.
ఎంఎస్ఎంఈ చట్టం ఏం చెబుతోంది?
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈచట్టం ప్రకారం.. చిన్న వెండార్లకు ప్రాధాన్యమివ్వాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఉంటే నిబంధనలను సడలిస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ఆ చట్టం, సర్టిఫికెట్లను ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు సరిపోయేలా రూ.12కోట్ల టర్నోవర్ నిబంధన పెట్టడం వెనక ఉన్న మతలబు ఏమిటో టీజీ రెడ్కో అధికారులు సమాధానం చెప్పాలని స్థానిక సోలార్ వెండార్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియలో పారదర్శకత లేదని జూన్ 6న జరిగిన ప్రీ బిడ్ సమావేశంలోనే వంద మందికి పైగా స్థానిక వెండార్లు అధికారులను నిలదీసినా ప్రయోజనం లేదు.
స్థానికులకు పని దక్కలేదు
మేము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఈ అక్రమాలపై మొరపెట్టుకున్నాం. మీరు చిన్న వెండార్లు కదా, ఇంత పెద్ద పనులు చేయగలరా? అని వారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మాకు అవకాశమిస్తేనే కదా మేము ఎదిగేది! గతంలో రూ.1,200 కోట్ల సోలార్ టెండర్లలో స్థానికులకు పని దక్కలేదు. అప్పుడు బయటవారు వచ్చి పనులు చేయలేక మళ్లీ మమ్మల్ని సబ్ కాంట్రాక్ట్ అడిగారు. ఇప్పుడు అదే తప్పు మళ్లీ చేస్తున్నారు. అధికారుల తీరు లోకల్ వెండార్లను కాదని, ఇతర రాష్ట్రాల కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా ఉంది. ఈ టెండర్ల ప్రక్రియపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించారు. నిబంధనలు సవరించాలి. లేదంటే స్థానిక సోలార్ పరిశ్రమలు మూతపడి ఎంతోమంది ఉపాధి కోల్పోతారు.
- బి.అశోక్ కుమార్ గౌడ్, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్(టీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు






