రవీంద్ర భారతిలో బాలసుబ్రహమణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం

by Muthe.Rajitha |   (  Updated:2025-12-02 16:56:58  IST  )

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది.

రవీంద్ర భారతిలో బాలసుబ్రహమణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం
X

దిశ, వెబ్ డెస్క్ : రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. కాగా డిసెంబర్ 15న SPB జన్మదినం రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బాల సుబ్రహ్మణ్యం బావమరిది శుభలేఖ సుధాకర్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీనిని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్పీబీకి రవీంద్రభారతి వంటి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో విగ్రహం ఎందుకు అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాడాలని ఎస్పీ బాలుని అడిగినప్పుడు తిరస్కరించాడని, ప్రాంతీయ బేధం ఉన్న బాలు విగ్రహం పెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.

తెలంగాణ ప్రముఖ కళాకారులైన గద్దర్, అందెశ్రీ వంటి వారి విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. దీంతో కొద్దిసేపు రవీంద్ర భారతి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు SPB విగ్రహం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కాగా ప్రాంతీయవాదం - కళాకారుల గౌరవం మధ్య చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థలాన్ని పరిశీలించి సూచనలు ఇచ్చారు. శుభలేఖ సుధాకర్ స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ వివాదం తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

Next Story