ఇరిగేషన్ శాఖలో పైరవీల పర్వం.. సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్!

by Naga Rani Yarlagadda |

ఇరిగేషన్ శాఖలో ఉద్యోగుల బదిలీల్లో సిఫారసు లేఖలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇరిగేషన్ శాఖలో పైరవీల పర్వం.. సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు వారిని వేరే చోటికి బదిలీ చేస్తుంటాయి. కానీ చేసిన తప్పులకు బదిలీ అయిన వారు కొత్త చోట మౌనంగా పని చేసుకోవాల్సింది పోయి.. మళ్లీ పాత సీటులోకే రావాలని ఆరాటపడుతున్నారు. దీని కోసం ఏకంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకొస్తూ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న ఈ తతంగం ఇప్పుడు ఆ శాఖతోపాటు సెక్రెటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి దరఖాస్తులను బుట్టదాఖలు చేయాల్సిన సర్కారు.. వాటిని పరిశీలిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.

రూలింగ్ పార్టీ లీడర్లతో పైరవీలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఈఈలు, డీఈఈలు, ఏఈఈలపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. చెరువులను కాపాడాల్సిన వారే.. భారీ స్థాయిలో మామూళ్లు తీసుకుంటూ బిల్డర్లకు అనుకూలంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. అందులో భాగంగా ఒకే సారి 106 మంది ఇంజినీర్లను బదిలీ చేసింది. ఆ జాబితాలో హైదరాబాద్ సర్కిల్ కు చెందిన వారే 60 మంది వరకు ఉండడం గమనార్హం. అయితే చాలా మంది తిరిగి హైదరాబాద్ సర్కిల్ లో పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. అందుకోసం రూలింగ్ పార్టీకి చెందిన లీడర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. సదరు లీడర్ల సిఫారసు లెటర్లతో పాత చోటికి బదిలీ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటుండగా.. వాటికి రిమార్క్స్ పంపాలంటూ ప్రభుత్వం ఇంజినీర్–ఇన్-చీఫ్ ను అడగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవినీతి ఆరోపణల కారణంతో బదిలీ చేసిన ప్రభుత్వమే.. పాత ప్లేస్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని సదరు ఇంజినీర్లు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించడం ఏమిటి? అనే చర్చ జరుగుతున్నది.

మంత్రుల లేఖలు, రాజ్యాంగ హోదాలోని వ్యక్తుల సిఫారసులు

హైదరాబాద్ సర్కిల్ కు బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఇంజినీర్లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు సుమారు 20 మంది ఇంజినీర్లు బదిలీ కోసం పలువురు ప్రముఖుల సిఫారసు లెటర్లతో దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం. ఆ సిఫారసు లెటర్లు ఇచ్చిన జాబితాలో ఐదారుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు, ముగ్గురు మంత్రులు ఉండగా, రాజ్యాంగ పదవిలో ఉన్న నేతలు సైతం ఉండడం హాట్ టాపిక్ గా మారింది. నేరుగా వారే సిఫారసు లెటర్లు ఇచ్చారా? లేక మధ్యవర్తులు వెళ్తే ఇచ్చారా? అనే చర్చ జరుగుతున్నది. కొందరు ఇంజినీర్లు హైదరాబాద్ సర్కిల్ కు వచ్చేందుకు సిఫారసు లెటర్లకే పెద్ద ఎత్తున మామూళ్లు సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

హైదరాబాద్ సర్కిల్ హాట్ కేక్

ఇరిగేషన్ శాఖలోని హైదరాబాద్ సర్కిల్ లో పనిచేసేందుకు ఇంజినీర్లు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ఎందుకంటే అక్కడ పనిచేస్తే భారీ స్థాయిలో మామూళ్లు అందుతాయని టాక్ ఉంది. ప్రధానంగా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించే విల్లాలు, హై రైజ్డ్ అపార్ట్ మెంట్లకు ఇరిగేషన్ శాఖ జారీ చేసే ఎన్ఓసీ తప్పనిసరి. కానీ చాలా ఏరియాల్లో కన్ స్ట్రక్షన్ కంపెనీలు చెరువులు, కుంటలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంటాయని, వాటిని అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు మామూళ్లు తీసుకుని ఎన్ఓసీలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఎన్ఓసీలు జారీ చేసేందుకే.. రూ.వందల కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గంపగుత్తగా ఇంజినీర్లను బదిలీ చేసింది. కానీ అధికార పార్టీ నేతల సిఫారసు లెటర్లతోనే తిరిగి పాత చోట పోస్టింగ్ కోసం ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Next Story