- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెత్తనానికే ప్రతిరూపం.. స్పోర్ట్స్ అథారిటీలో ఆయనదే రాజ్యం
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి చెందిన వ్యక్తుల పెత్తనం ప్రభుత్వ సంస్థలో కొనసాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి చెందిన వ్యక్తుల పెత్తనం ప్రభుత్వ సంస్థలో కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(SATG)లో ఏపీకి చెందిన ఓ వ్యక్తి హల్‌చల్ చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుమతి లేకుండా సంస్థలో ఓ టేబుల్ నుంచి మరో టేబుల్‌కు ఫైల్ వెళ్లదనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కాంట్రాక్టు పనుల్లో ఆ వ్యక్తి చెప్పినట్టుగానే నిబంధనలు తయారవుతాయని ప్రచారం ఉంది. ఏ వర్క్‌కు టెండర్లు పిలవాలి? ఏ వర్క్‌ను నామినేషన్ పద్ధతిలో అప్పగించాలో సదరు వ్యక్తే డిసైడ్ చేస్తారని టాక్. ఒకవేళ ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే సీనియర్ అధికారులను సైతం బెదిరిస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంట్రాక్టు పద్ధతిలో అపాయింట్మెంట్
ఏపీకి చెందిన ఓ ఎంపీడీవో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌కు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చుకున్నారు. కానీ ఏపీ మూలాలు ఉండటం, తెలంగాణకు చెందిన స్థానిక అధికారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన్ను విభజన కమిటీ ఆంధ్రాకే కేటాయించింది. దీనితో అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. కొంతకాలం ఇక్కడే డిప్యూటేషన్ పై పనిచేశారు. శాశ్వతంగా ఇక్కడే పనిచేసేందుకు నిబంధనలు అడ్డుగా ఉండటంతో తన పదవికి రాజీనామా చేసి సీనియర్ బ్యూరోక్రాట్స్ సహకారంతో ఇక్కడే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. కొంతకాలం హండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేశారు. ఆ తర్వాత తనకున్న పరిచయాలతో ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేషీలో చేరారు. ఓ ముహుర్తాన స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణలో కీలక పదవికి పుల్ అడిషనల్ చార్జి హోదాలో(FAC) అపాయింట్ అయ్యారు.
SATGలో ఆయన మాటే వేదం
సాధారణంగా రెగ్యూలర్ పద్ధతిలో అపాయింటైన అధికారులు సంబంధిత సంస్థల్లో పెత్తనం చెలాయిస్తుంటారు. కానీ స్పోర్ట్స్ అథారిటీలో వీసీ అండ్ ఎండీ, చైర్మన్ మాటల కన్న సదరు వ్యక్తి మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టు పద్ధతిలో జీహెచ్ఎంసీలో స్పోర్ట్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉందనే కారణంతో SATGలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. దీనితో ఆయన చెప్పినట్టుగానే సంస్థ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయని, ఎవరైన తన మాటలకు అడ్డుచెప్తే ‘‘నాకు పెద్ద ఆఫీసర్ల సఫోర్టు ఉంది. నన్ను ఎవరు ఏం చెయ్యలేరు. నేను చెప్పినట్టుగానే వినాలి’’ అని బెదిరించడం పరిపాటిగా మారినట్టు తెలిసింది. దీనితో అక్కడ పనిచేస్తోన్న రెగ్యూలర్ అధికారులు సైతం సదరు వ్యక్తి చెప్పినట్టు పనిచేస్తున్నారని టాక్ ఉంది.
ఖేలో ఇండియా పనుల్లో కీలక పాత్ర
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు కావాల్సిన స్టేడియాల రిపేర్లు, మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంతటి కీలకమైన పనుల బాధ్యతలను కాంట్రాక్టు పద్ధతిలో అపాయింటైన ఏపీకి చెందిన ఓ వ్యక్తి కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. ఆయన పర్యవేక్షణలోనే ఏ పనులకు టెండర్లు పిలవాలి? ఏ పనులకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాలో డిసైడ్ అవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రూ. కోట్లాది విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తన సన్నిహితులకు కట్టబెట్టారని తెలుస్తున్నది.
ఇద్దరు బ్యూరోక్రాట్స్ అండదండలు..
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇష్టానుసారంగా నియామకాలు జరుగుతున్న విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్.. కొత్తగా నియామకాలు జరిపే ముందు ఆర్థిక శాఖ అనుమతితో పాటే శాంతికుమారి కమిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు. కానీ, SATGలో కీలక హోదాలో అపాయింట్ చేసిన వ్యక్తి నియామకం విషయంలో ఆర్థిక శాఖను సంప్రదించలేదని తెలిసింది. అందుకు సదరు వ్యక్తికి ఇద్దరు సీనియర్ బ్యూరోక్రాట్స్ ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ సీనియర్ అధికారులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆ వ్యక్తికి అనుభవం ఉండటంతో సీఎం రూల్స్‌ను సైతం పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. ‘ఓ బ్యూరోక్రాట్ అండదండలతో ముందుగా ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేషీలో అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత పుల్ అడిషనల్ చార్జి హోదాలో SATGలో కీలక హోదాలో పనిచేస్తున్నారు’ అని ప్రచారం సాగుతోంది.






