- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నింటా జాప్యమే! ఎస్పీడీసీఎల్‌పై వినియోగదారుల ఆగ్రహం
విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శనివారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఎస్పీడీసీఎల్ అధికారుల పనితీరుపై వినియోగదారులు విరుచుకుపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శనివారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఎస్పీడీసీఎల్ అధికారుల పనితీరుపై వినియోగదారులు విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుమారు 94 మందికి పైగా ఫిర్యాదుదారులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యల నుంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి దారుల ఇబ్బందుల వరకు పలు అంశాలపై ఈ విచారణ వేదికైంది.
ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందేనా?
సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు అధికారుల నిర్లక్ష్యాన్ని కమిషన్ ముందు ఎండగట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డిమాండ్ డ్రాఫ్టులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ అవి మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కమిషన్, సాంకేతిక అవసరాల ప్రాతిపదికన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని సూచించింది.
సోలార్ బిల్లింగ్‌పై ఈఆర్సీ సీరియస్..
సోలార్ నెట్ బిల్లింగ్ విధానంలో చేసిన మార్పులు ఉత్పత్తిదారులకు శాపంగా మారాయని పలువురు ఫిర్యాదు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ను ప్రోత్సహిస్తుంటే, ఎస్పీడీసీఎల్ మాత్రం వినియోగదారులకు నష్టం కలిగేలా నిబంధనలు మార్చడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బిల్లింగ్ విధానాన్ని ఎలా మారుస్తారు?’ అని అధికారులను నిలదీసింది. సోలార్ ఉత్పత్తిదారులను వ్యాపారవేత్తలుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా గుర్తించి ప్రోత్సహించాలని వినియోగదారులు కోరారు.
డబుల్, ట్రిపుల్ బిల్లులపై విచారణ
లీడ్ అన్‌లాక్ విధానంతో విద్యుత్ బిల్లులు అసాధారణంగా పెరుగుతున్నాయని, దీనిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని వినియోగదారులు కోరారు. దీనికి ఈఆర్సీ సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక అధ్యయనానికి అనుమతినిచ్చింది.
మరికొన్ని కీలక విన్నపాలు
- ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లను నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ద్వారానే చేపట్టాలి.
- పశువుల షెడ్లకూ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిద్దిపేట రైతు కోరారు.
- తమకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైల్వే శాఖ, సబ్సిడీ వర్తింపజేయాలని వాటర్ బోర్డు విజ్ఞప్తి చేశాయి.
- పాత పద్ధతిలో టర్న్ కీ విధానాన్ని పునరుద్ధరించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
- డిస్కంల వల్ల వినియోగదారులకు కలిగే ఆర్థిక నష్టాన్ని ఎస్పీడీసీఎల్ సంస్థే భరించాలని పలువురు స్పష్టం చేశారు.






