- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిస్కెట్‌లో ప్లాస్టిక్.. బ్రిటానియా, డి-మార్ట్‌కు వినియోగదారుల కమిషన్ షాక్!
బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, డి-మార్ట్‌లకు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బిస్కెట్ ప్యాకెట్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు రావడంపై దాఖలైన కేసులో ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, డి-మార్ట్‌లకు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బ్రిటానియా దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, బాధిత వినియోగదారునికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2019లో అడ్వకేట్ సంధ్య యాదవ్ సనత్ నగర్‌లోని డి-మార్ట్ స్టోర్‌లో తన నాలుగేళ్ల కుమార్తె కోసం బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్లను కొనుగోలు చేశారు. బిస్కెట్లు తినిపిస్తున్న సమయంలో ఒక బిస్కెట్ లోపల ప్లాస్టిక్ కవర్ ముక్క ఇరుక్కుపోయి ఉండటాన్ని ఆమె గమనించారు. నాణ్యత లేని ఆహార పదార్థాల వల్ల తన బిడ్డ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందంటూ ఆమె 2019 మార్చిలో జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
రూ.25వేల పరిహారాన్ని చెల్లించాలి
స్టేట్ టెస్ట్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో బిస్కెట్‌లో ఉన్నది ప్లాస్టిక్ వ్యర్థమేనని తేలింది. దీనిని తీవ్రమైన సేవా లోపంగా పరిగణించిన జిల్లా ఫోరం.. బాధితురాలికి కలిగిన మానసిక క్షోభకు గాను రూ.25వేల పరిహారాన్ని బ్రిటానియా, డి-మార్ట్ సంయుక్తంగా చెల్లించాలని గతంలోనే ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బ్రిటానియా సంస్థ ఖైరతాబాద్‌లోని రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసింది. అయితే సుదీర్ఘ వాదనల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 25న రాష్ట్ర కమిషన్ తుది తీర్పు వెలువరించింది. జిల్లా ఫోరం నిర్ణయాన్ని సమర్థిస్తూ, అప్పీల్‌ను కొట్టివేసింది. జరిమానా మొత్తంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కించి వడ్డీని కూడా కలిపి సంధ్య యాదవ్‌కు చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.






