- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్న పేదలు!
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం సెక్రెటేరియట్‌లోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి సమీక్షించారు.
10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని మంత్రి పొంగులేటి వివరించారు. హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో తేలిందని చెప్పారు. చాలాచోట్ల బోగస్ లబ్ధిదారులు కూడా ఉన్నారని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వారివారి ప్రాంతాలలో స్థలాలను గుర్తించి ఎన్ని ఇండ్లు నిర్మించవచ్చు? ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు? వంటి వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మురికివాడల్లో స్థలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీ+5 వరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. జేఎన్ఎన్‌యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయని.. వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు.
ఈనెల చివరలోగా మంజూరు పత్రాలు..
మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇండ్ల స్థలాలు ఉన్న 28వేల మంది లబ్ధిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మార్చి చివరినాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అంతకుముందు ఖర్చుచేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేస్తుందని తెలిపారు. చాలా చోట్ల ఇండ్లు తీసుకొని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్ లబ్ధిదారులను కూడా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. అనర్హుల స్థానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని సూచించారు. 2 బీహెచ్‌కే నివాస ప్రాంతాలలోని ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ మీటర్లను లబ్ధిదారుల పేరిట బదిలీ చేయాలని.. అలాగే 2 బీహెచ్‌కే కాలనీల్లో తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలు, ఎస్టీపీలు, యూజీడీల వ్యవస్థ హైదరాబాద్ వాటర్ బోర్డు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్-ఓఆర్ఆర్ పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో కేపీహెచ్‌బీలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని.. ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.






