అటకెక్కిన ‘డబుల్’ ఇండ్ల నిర్మాణం.. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఒత్తిడి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-02 02:34:23  IST  )

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అటకెక్కింది.

అటకెక్కిన ‘డబుల్’ ఇండ్ల నిర్మాణం.. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో చేపట్టి లక్ష ఇండ్లు నేటికి పూర్తికాలేదు. అందుకు పెండింగ్ బిల్లులే కారణం. 2017లో చేపట్టిన ఇండ్లు ఎనిమిదేండ్లుగా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు మేం చేయలేం.. చేసినకాడికి బిల్లులివ్వండి.. ప్రస్తుత ధరలకనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తాం’ అంటూ కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ కాంట్రాక్టర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని తెలిసింది. పనులు ప్రారంభించే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రేట్లు పెంచాలని లేదు. దీంతో ఎక్కడి ఇండ్లు అక్కడే నిలిచిపోయాయి.

రూ.9,714.59 కోట్లతో లక్ష ఇండ్లు

బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్లు లేని పేదలకు ఈ స్కీమ్ ద్వారా లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. 100 శాతం సబ్సిడీతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ నగరంలో ఒక్క ఐడీహెచ్ కాలనీలో ఇండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. తర్వాత చేపట్టిన లక్ష ఇండ్ల కోసం రూ.8598.58 కోట్లకు పరిపాలన మంజూరు ఇచ్చింది. తర్వాత స్టీల్ రేట్లు పెరిగిన సందర్బంగా మరో రూ.500 కోట్లు, డబుల్ ఇండ్ల కాలనీల్లో కరెంట్, తాగునీటి సరఫరా, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి మరో రూ.616.10 కోట్లు మంజూరుతో మొత్తం రూ.9,714.59 కోట్లతో లక్ష ఇండ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు.

అసంపూర్తిగా 27,996 ఇండ్లు

జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను చేపట్టాలని నిర్ణయించారు. 108 ప్రాంతాల్లో 97,629 ఇండ్లకు సంబంధించిన పనులు చేపట్టారు. మరో 2,371 ఇండ్లకు పనులు నేటికి ప్రారంభంకాలేదు. చేపట్టిన ఇండ్లలో మురికివాడల్లోని పాత ఇండ్లను కూల్చేసి వాటిస్థానంలో (ఇన్‌సిటూ) 39 ప్రాంతాల్లో 8,474 ఇండ్లను నిర్మించారు. 69 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 89,155 ఇండ్లకు సంబంధించిన పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటి వరకు 73 ప్రాంతాల్లో 69,633 ఇండ్లు పూర్తిచేశారు. వీటిని అన్ని సౌకర్యాలతో పూర్తిచేయడంతో పాటు లబ్ధిదారులకు 47,027 ఇండ్లను పంపిణీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరో 27,996 ఇండ్లకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి.

పెండింగ్ పనులకు రూ.2,823.49 కోట్లు

రూ.9,714.59 కోట్లతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన అప్పటి ప్రభుత్వం రూ.6,891.10 కోట్లు ఖర్చుచేసింది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు ఇవ్వాల్సిన బిల్లులు రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 27,996 ఇండ్లకు సంబంధించిన పనులు పూర్తిచేయాలంటే రూ.2,823.49 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. దీంతోపాటు కరెంట్ సౌకర్యం కల్పించడానికి టీజీఎస్పీడీసీఎల్‌కు రూ.49.04 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి జలమండలికి రూ.38.85 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

మూసీ బాధితులకు

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఇండ్లను కోల్పోయినవారికి 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 14 ప్రాంతాల్లో 1,672 ఇండ్లను కేటాయించారు. వీరిలో 311మంది లబ్ధిదారులు మాత్రమే ఇండ్లలో ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మూసీ బాధితులకు ఇవ్వడానికి ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో తాత్కాలికంగా నిలిపేశారు.

2025 యాక్షన్ ప్లాన్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేయడానికి జీహెచ్ఎంసీ 2025లో యాక్షన్ ప్లాన్ రూపొందించింది. 14,347 ఇండ్ల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి, ఇతర సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న 27,966 ఇండ్లను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పాత కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడంతో కొత్తవారికి ఇవ్వాలని నిర్ణయించారు.

Next Story