CM రేవంత్‌, పీసీసీ చీఫ్‌కు క్షమాపణలు.. ఇక నుంచి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా: Sunita Rao

by Gantepaka Srikanth |

తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, టీపీసీసీ ఛీప్​మహేష్​కుమార్​గౌడ్, కాంగ్రెస్​అధిష్టానాన్ని క్షమాపణలు కోరారు.

CM రేవంత్‌, పీసీసీ చీఫ్‌కు క్షమాపణలు.. ఇక నుంచి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా: Sunita Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, టీపీసీసీ ఛీప్​మహేష్​కుమార్​గౌడ్, కాంగ్రెస్​అధిష్టానాన్ని క్షమాపణలు కోరారు. గాంధీ భవన్​మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనకు అందిన క్రమశిక్షణ నోటీస్‌పై రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు జాతీయ అధ్యక్షురాలు ఆల్కలాంబను స్వయంగా కలిసి మాట్లాడాడని చెప్పారు. గాంధీ భవన్‌లో చోటుచేసుకున్న విషయాలు చాలా బాధాకరమన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, దీంతో తాను, తన మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరూ చేసిన బాధ్యత తనదే అని పేర్కొన్నారు.

ఈ విషయంలో పెద్ద మనసు చేసి అంతా తనను, మహిళ కాంగ్రెస్ నాయకులను క్షమించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ అధిష్టానాన్ని మీడియా వేదికగా కోరుతున్నానని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్‌కి పెద్ద పీఠ వేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరికీ కూడా సమ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాను పార్టీ మారుతున్నాన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, అధిష్టానం నిర్ణయం ప్రకారం కాంగ్రెస్​పార్టీకి కట్టుబడి ఉంటానని సునీతరావు స్పష్టం చేశారు.

జాన్ 3వ తేదీ నుంచి ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మంగళవారం రాష్ట్రం నుంచి ఐదుగురికి జిల్లా అధ్యక్షులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె సూచించారు. ఇదిలాఉండగా మొగిలి సునీతరావు ఇటీవల గాంధీ భవన్‌లో మహిళా నాయకులతో కలిసి పీసీసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆమెకు జాతీయ మహిళా కాంగ్రెస్​అధ్యక్షురాలు అల్కలాంబ షోకాజ్​నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో రిప్లై ఇవ్వాలని ఆమెను ఆదేశించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​చేయడం ఖాయం అని గాంధీ భవన్​వర్గాలు చెప్పుకొచ్చాయి. అలాగే సునీతరావు పార్టీ మారుతారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సునీతరావు స్పందిస్తూ గాంధీ భవన్​మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పడంతో రాజకీయ వర్గాల్లో హాట్​టాపిక్‌గా​మారిన అంశానికి తెరపడినట్లయింది.

Next Story