- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైజింగ్.. దేశానికి ఆదర్శంగా ఇందిరమ్మ సంక్షేమ పాలన : భట్టి
రాష్ట్రంలో ప్రతి కుటుంబం క్షేమంగా, సంతోషంగా ఉండేలా లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని

దిశ, కేసముద్రం: రాష్ట్రంలో ప్రతి కుటుంబం క్షేమంగా, సంతోషంగా ఉండేలా లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేసముద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో ప్రజల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్‌మేనని పేర్కొన్నారు. ‘‘రైతు భరోసా’’ కింద కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ నెల 12 నుంచి డ్వాక్రా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీని ఉత్సవంలా నిర్వహిస్తామని వెల్లడించారు.
అంతేగాక, నిరుద్యోగ యువత కోసం రూ. 8 వేల కోట్లతో ‘‘రాజీవ్ యువ వికాసం’’ కార్యక్రమాన్ని కూడా ఉత్సవంలా ప్రారంభిస్తామన్నారు. ప్రజల హక్కులను కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్‌మేనని, చేయి గుర్తును గుండెల్లో పెట్టుకొని ప్రజా ప్రభుత్వాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ రోజుకు 18 గంటలపాటు విరామం లేకుండా ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తోందని వివరించారు. రూపాయి రూపాయిని సద్వినియోగం చేస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో 112 లక్షల కుటుంబాలుండగా, వాటిలో 90 లక్షలకుపైగా కుటుంబాలకు కనీసం ఒక సంక్షేమ పథకం ద్వారా మేలు జరుగుతోందని వెల్లడించారు. ‘‘తెలంగాణ రైజింగ్’’ ను దేశం మొత్తం గమనిస్తున్నదని, తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలనుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధులకు చేయూత పథకం కింద పెన్షన్లు, అన్నదాతలకు సన్న బియ్యం, గ్యాస్ సిలిండర్ రూ.500కే, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం వంటి అనేక పథకాలపై ఆయన వివరించారు.
ఉపాధి హామీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు.. ఇలా పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడివరకు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక పథకం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇదేనన్నారు.
వేం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలు:
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలతో పాటు వేల కోట్ల అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కేసముద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు.






