- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ Vs బీజేపీ.. పోటాపోటీగా పార్టీ ఆఫీసుల ముట్టడి ప్రయత్నంతో హైటెన్షన్
బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్ల దాడి కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald Case) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఇవాళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా పలు చోట్ల టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌తోపాటు ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నినాదాలు హాట్ టాపిక్‍గా మారాయి.
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత:
పార్టీ పిలుపు మేరకు ఈ ఉదయమే హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్దకు (Gandhi Bhavan) వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చాయి. గాంధీ భవన్ సమీపంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP State Office) వరకు నిరసన ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనలో పాల్గొంటున్న ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు బయల్దేరగా సునీతారావు సహా మహిళా నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీభవన్, అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
పలు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం:
కాంగ్రెస్ నిరసన పిలుపుతో పలు జిల్లాల్లో ఇరు పార్టీలమ ధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఇక బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బీజేపీ నాయకులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకు, ఆ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల ధర్నా కొనసాగుతోంది. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణలు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైకి కోడిగుడ్లు విసిరారు. అప్పటికే బీజేపీ ఆఫీస్‌లో ఉన్న కమలం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపైకి దూసుకువచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల పోటాపోటీ నినాదాలతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. వరంగల్‌లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొట్లాట టెన్షన్ పెట్టింది. పలు జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టడిలో పాల్గొనగా పోలీసులు అరెస్ట్ చేశారు.






