- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాస్త్రాలు ఇవే.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన ప్రణాళికలు రచిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని భావిస్తున్నది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నది. దీంతో వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. దీంతోపాటు ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, గ్యాస్‌పై రాయితీ, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నది. అంతేకాకుండా గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, ఫోర్త్ సిటీకి ఫౌండేషన్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య అభివృద్ధి, మూసీ నదీ ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని హస్తం నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల పార్టీకి ఇబ్బంది పెట్టిన యూరియా సమస్య చాలా వరకు తీరిందని హస్తం నేతలు భావిస్తున్నారు.
దిశా నిర్దేశం
స్థానిక ఎన్నికల్లో పార్టీని ట్రాక్ పైకి తెచ్చేందుకు ఇటీవల పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, విస్తృత స్ధాయి సమావేశాలను నిర్వహించి పార్టీ ముఖ్యులు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ లో ఉన్న డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించింది. అక్టోబర్ 4 నుంచి తెలంగాణలో క్షేత్రస్ధాయిలో పర్యటించి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తారు. అంతకు ముందే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జిల్లా కార్యవర్గాల కూర్పుపై కసరత్తులు పూర్తి చేశారు. ఆ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఇక స్థానిక ఎన్నికల్లో సంస్థాగత బలోపేతం దృష్టి పెట్టిన హస్తం నేతలు ఇతర పార్టీ నుంచి చేరికలు, పార్టీకి దూరంగా ఉన్న పాత నేతలను తిరిగి చేర్చుకునే అంశంపై కూడా దృష్టి సారించారు. ఘర్ వాపసీని స్పీడ్ అప్ చేసే యోచనలో హస్తం నేతలున్నారు.
టికెట్ల కోసం ప్రయత్నాలు
స్థానిక ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల దగ్గర లాబీయింగ్ పెరిగినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్ల ప్రకారం తమకు కలిసి వచ్చే ఆయా సామాజిక వర్గాల నేతలు టికెట్లపై తమ వాదనలు పార్టీ ముఖ్యల దగ్గర వినిపిస్తూ టికెట్లు తమకే ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ద్వారా ఈసారి జనరల్ స్థానాలు తగ్గడంతో ఆ సీట్లపై భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ బంధువులు, వారసులను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కోర్టు తీర్పును బట్టి నేతలు తమ ప్రయత్నాలను మరింత పెంచే అవకాశాలున్నాయి. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి ఈ లోకల్ బాడీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి.






