- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని సూచనలపై కాంగ్రెస్ దుష్ప్రచారం : రాంచందర్‌రావు తీవ్ర ఆరోపణలు
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రయోజనం, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడడం సరైంది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ప్రధాని మోడీ చేసిన సూచనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించిందని.. ఆ సమయంలో దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నదని అన్నారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు దేశానికి సైనిక సామర్థ్యం కూడా పరిమితంగానే ఉండేదని.. ఆ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహకారాన్ని కోరారని తెలిపారు. చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు భారత సైన్యానికి సహకారం అందించి దేశభక్తిని చాటారని వెల్లడించారు. ఆ సేవలను గుర్తించి అనంతరం జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారని.. ఇది చరిత్రలో నమోదైన విషయమని వివరించారు.
నేటికీ లండన్, అమెరికా, యూరప్ దేశాల్లో..
సోలార్ పంపులను వినియోగించండి, ప్రజా రవాణాను ఉపయోగించండి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించండి, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి, వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు ఇవ్వండి అని మోడీ ఇచ్చిన పిలుపులో తప్పేముందని ప్రశ్నించారు. నేటికీ లండన్, అమెరికా, యూరప్ దేశాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, మంత్రులు, ప్రధానులు ప్రజా రవాణానే ఉపయోగిస్తారని.. లండన్‌లో ట్యూబ్స్ పేరుతో అండర్ గ్రౌండ్ మెట్రో వ్యవస్థను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని.. అది వారికి డబ్బుల్లేక కాదని.. ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసమని చెప్పారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో కూడా ప్రధానులు సైకిళ్లపై ప్రయాణించే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రతీ సోమవారం భోజనం మానేయాలని దేశ ప్రజలను కోరారని.. ఇందిరా గాంధీ హయాంలో టాక్ లెస్ - వర్క్ మోర్ నినాదం తీసుకొచ్చారని.. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేశారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ సైతం సబ్సిడీలను తగ్గించాల్సిందే అని అన్నారని గుర్తుకు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతున్నదన్నారు.
అమెరికాలోనూ పెరిగిన పెట్రోల్ ధరలు
అమెరికాలో పెట్రోల్ ధరలు సుమారు 59 శాతం పెరిగాయని.. కెనడాలో 43 శాతం, దక్షిణాఫ్రికాలో 31 శాతం, టర్కీలో 27 శాతం పెరిగాయని తెలిపారు. భారత్‌లో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంచిందని స్పష్టం చేశారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల మధ్య తేడా గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. యూపీఏ కాలంలో రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండగా, ఇప్పుడు రూ.12.75 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించారన్నారు. యూపీఏ కాలంలో మౌలిక వసతులపై రూ.1.57 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ఎన్డీయే కాలంలో రూ.44.3 లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. యూపీఏ కాలంలో రూ.13 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే.. ఎన్డీయే కాలంలో రూ.320 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగిందన్నారు. యూపీఏ కాలంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని.. ఎన్డీయే పాలన పారదర్శకంగా కొనసాగుతుందని వెల్లడించారు.






