జీహెచ్ఎంసీ హస్తగతమవుతుందా? : ఆ పార్టీతో పొత్తుతో నయా ప్లాన్

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఎన్నికలను విజయం సాధించాలని భావిస్తున్నది.

జీహెచ్ఎంసీ హస్తగతమవుతుందా? : ఆ పార్టీతో పొత్తుతో నయా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఎన్నికలను విజయం సాధించాలని భావిస్తున్నది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేళ్లూ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయాయి. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​సింగిల్​డిజిట్‌కే పరిమితమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలువుదీరాక మేయర్ విజయలక్ష్మి హస్తం గూటికి చేరారు. ఆమెతో పాటే చాలా మంది ఇతర పార్టీల కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మేయర్ కుర్చీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వశమైంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పూర్తయింది. ఇక్కడ అధికార పార్టీ సత్తా చాటింది. అయితే, కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో కాంగ్రెస్‌కు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చిందని.. ఫలితంగా గెలుపు సునాయాసం అయ్యిందనే చర్చ జరుగుతున్నది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ మద్దతును కాంగ్రెస్​తీసుకుంటుందా? అనే ఆసక్తికర చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మొదలైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లీస్​పార్టీ అక్కడ ఏకంగా ఐదు అసెంబ్లీ సీట్లను సాధించింది. ఎంఐఎం బరిలో నిలవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్​కూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లు కాస్త మజ్లిస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంఐఎంతో పొత్తు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలడం ఖాయం. జాతీయ స్థాయిలో మజ్లిస్​పార్టీకి, కాంగ్రెస్‌కు సంబంధాలు అంతగా బాలేవు. కానీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌తో ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహారిస్తున్నది.

ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం వెయిటింగ్

రేవంత్‌రెడ్డి సర్కార్​ఎంఐఎం పార్టీతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక తరహాలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే మజ్లిస్ పార్టీ మద్దతు అవసరమని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. కానీ పొత్తు కోసం ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్​రావాల్సి ఉంది. కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎంఐఎంతో మైత్రి విషయమై ఏ విధంగా స్పందిస్తారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే పొత్తు తప్పనిసరి అనే అభిప్రాయంలో హస్తం నేతలు ఉన్నట్టు టాక్.

ఎంఐఎం చేతిలో 45 నుంచి 50 డివిజన్లు

ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో ఆ పార్టీ ఏకపక్షంగా 45 నుంచి 50 డివిజన్ల వరకూ సీట్లను గెలుచుకుంటూ వస్తున్నది. ఓల్డ్​సిటీ కాకుండా ముస్లిం ప్రాబల్యం ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఎంఐఎం తన సత్తా చాటుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో గణనీయంగా సీట్లు సాధిస్తేనే మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు సాధించిన కాంగ్రెస్.. గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తద్వారా మజ్లిస్​పొత్తు ఉంటే మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఈజీ అవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. కాగా, జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలని హస్తం నేతలు అంటున్నారు.

Next Story