- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తంగూటిలో అసంతృప్తి సెగ.. పార్టీ, ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు
పార్టీ, ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు, రాజకీయ కారణాలు ప్రస్తావిస్తూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ, ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు, రాజకీయ కారణాలు ప్రస్తావిస్తూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయనే నెలకొన్నదన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. తాజాగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. స్థానిక సీనియర్ నేతగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం సరికాదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే తన మునుగోడు నియోజకవర్గం కూడా వస్తుందని, తన జిల్లాకు సంబంధించిన కీలకమైన నిర్ణయంలో కనీసం చెప్పకపోవడం ఏమిటీ? స్థానిక ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఓ చానల్ తో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇటీవల సీఎం పాల్గొన్న నల్లగొండ సభకు హాజరుకాలేదని ఆయన సంచలన కామెంట్లు చేశారు. ‘పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన పాత కాంగ్రెస్ నేతలు రోజురోజుకు కనుమరుగవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చారు. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో అంతా వాళ్లదే నడుస్తున్నది’ అని రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు పార్టీలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రివర్గంలో తనకు చోటు కల్పించకపోవడంతోనే ఆయన బహిరంగంగా విమర్శిస్తున్నారని, పార్టీ తగిన చర్యలు తీసుకోవాలని నేతలు అంటున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలకే ఇంపార్టెన్స్ అని..
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన కామెంట్లు కూడా పార్టీలో చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలకే మంత్రులు, అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక అప్పుడప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కూడా అధికారులు, కొందరు స్థానిక నేతలు, మంత్రులపైన సునిశిత విమర్శలు చేస్తున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఓ సందర్భంలో నియోజకవర్గంలో అభివృద్ది పనుల్లో జాప్యం జరుగుతోందని, సంబంధిత మంత్రికి విన్నవించినా స్పందన సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇలా బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లడించడం వల్ల పార్టీలో ఆ సమస్యకు దారితీసిన పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమాన్ని పార్టీ చేపడితే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.






