- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘సర్’ (SIR) ఓటర్ల సవరణ పై కాంగ్రెస్ హై అలర్ట్
జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ‘సర్’ ఓటర్ల సవరణ ప్రక్రియపై టీపీసీసీ అలర్ట్ అయింది. ఓట్ల తొలగింపు జరగకుండా బీఎల్ఏలకు శిక్షణ ఇవ్వనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రారంభం అవుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ‘సర్’కి సంబంధించిన ప్రక్రియపైన రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సర్ ప్రక్రియ ప్రారంభం అయినప్పుటి నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ‘సర్’ ద్వారా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారని, అది బీజేపీ విజయానికి లాభించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో బెంగాల్ తర్వాత తెలంగాణనే తమ తదుపరి లక్ష్యమంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీఅలర్ట్ అయింది. ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సూచనలు, అభ్యంతరాలు తెలుపుతూ ఇటీవలే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం సీఈవోకి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేనందున, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓట్ల సవరణను ఏడాది పాటు వాయిదా వేయాలని, ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని, బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ పేరిట లౌకికవాదాన్ని నమ్ముకున్న వారి ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించింది.
బీఎల్ఏలు, మండల కమిటీలపై కసరత్తు..
సర్ ప్రక్రియకు సంబంధించి బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్లు)లది కీలకపాత్ర కావడంతో బీఎల్ఏల నియామకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని టీపీసీసీ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమించి దీనిపై దృష్టి పెట్టాలని ముఖ్య నేతలు కోరుతున్నారు. బీఎల్ఏలకు సర్ ప్రక్రియపైన శిక్షణ ఇవ్వాలనే ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక గ్రామస్థాయిలో ఓటర్లకు సంధించిన అవగాహన పెంచేందుకు మండల కమిటీలను వీలైనంత వేగంగా చేపట్టాలని పార్టీ నేతలకు సూచిస్తోంది. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీల కూర్పుపైన దృష్టి పెట్టాలని కేడర్‌కి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే గాంధీభవన్‌లో పార్లమెంటరీ నియోజవకర్గాల వర్గాల వారీగా టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ బీఎల్ఏ, మండల కమిటీల కూర్పు పై నేతలతో చర్చించారు.






