- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

యూరియా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల పోరు
పార్లమెంట్ దగ్గర ప్లకార్డులతో ధర్నా
టీ బీజేపీ ఎంపీలకు తెలంగాణ రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్న
3 లక్షల టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
కేంద్ర మంత్రి నడ్డాకు వినతి పత్రం సమర్పణ
దిశ, తెలంగాణ బ్యూరో : యూరియా కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పోరుబాట పట్టారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియాను కేటాయించడం లేదని ఆరోపించారు. యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ దగ్గర కార్డులు ప్రదర్శిస్తూ వారు ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డాను కలిసి కాంగ్రెస్ఎంపీలు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో తెలంగాణ కాంగ్రెస్ఎంపీలకు మద్దతుగా ఇతర రాష్ట్రాల ఎంపీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన 8 లక్షల టన్నుల యూరియాను ఇవ్వకుండా, 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఇంకా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని, ప్లాన్ ప్రకారం కాకుండా తక్కువ యూరియాను ఇచ్చారన్నారు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా కొరత ఏర్పడిందని మల్లు రవి చెప్పారు. యూరియా కోసం రైతులు ఉద్యమం చేసే పరిస్థితి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలం పార్లమెంట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శించి ధర్నా చేశామన్నారు.
పార్లమెంట్‌లో అర్జెన్‌మెంట్ మోషన్ ఇచ్చామని, జీరో అవర్‌లో కూడా అందరం ఎంపీలం నోట్ ఇచ్చామని మల్లు రవి చెప్పారు. కానీ సభ సజావుగా జరగడం లేదని, ఉదయం నుంచి సభ వాయిదా పడుతూ వస్తోందన్నారు. యూరియా కోసం ప్రొసీజర్ ప్రకారం ప్రయత్నాలు చేస్తున్నామని మల్లు రవి తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నడ్డాను కలిసి పరిస్థితిని వివరించారని, కానీ ఆయన ఇప్పటివరకు యూరియాను కేటాయించలేదని విమర్శించారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని, తెలంగాణ ఎంపీలే కాకుండా మరో 25 మంది ఎంపీల మద్దతు కోరామని, వారు తమకు సహకరిస్తున్నారన్నారు. 21వ తేదీ వరకు జీరో అవర్ మోషన్ ఇస్తామని, ధర్నాలు చేస్తామని మల్లు రవి తెలిపారు. 3 లక్షల టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు. ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీలకు, ఎంఐఎం ఎంపీకి కూడా వివరించామన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియా ఇవ్వడం లేదని మల్లు రవి ఆరోపించారు. తెలంగాణకు చెందిన పెండింగ్ ఇష్యూలపైనా పవర్ పాయింట్ ప్రజంటెషన్ కూడా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, సురేష్ షెట్కర్, వంశీకృష్ణ, రాజ్యసభ సబ్యుడు అనిల్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణాలో యూరియా కొరతపై పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మాణం
తెలంగాణాలో యూరియా కొరతపై పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ఎంపీలు వాయిదా తీర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ వాయిదా తీర్మాణా ప్రతిపాదనను లోకసభ సెక్రటరీ జనరల్‌కు లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని, ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని ఎంపీ చామల వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందని ఆయన తెలిపారు. దీనితో రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కొరత ఏర్పడిందని ఎంపీ చామల ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్పన్నమైన ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత అంశాన్ని లేవనెత్తేందుకు తనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లుగా ఎంపీ చామల తెలిపారు.






